
మంటల్లో 15 ఇళ్లు, డజనుకు పైగా కార్లు
పలువురు మృతి చెందినట్లు అనుమానం
శాన్ డియాగో: అమెరికాలోని శాన్ డియాగో శివారులోని జనావాసాల మధ్య గురువారం తెల్లవారుజామున చిన్న విమానం ఒకటి కూలింది. ఈ ఘటనలో పలువురు మృత్యువాతపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన శకలాలతోపాటు ఇంధనం పారబోసినట్లు పడి మండటంతో 15 ఇళ్లలో మంటలు చెలరేగాయి. మరో డజను వరకు కార్లు కాలిపోయాయని అధికారులు తెలిపారు.
జనావాసాలున్న చోట విమాన ప్రమాదం చోటుచేసుకుందన్నారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆస్పత్రిలో చేర్చామని, మరో ఇద్దరికి స్వల్పంగానే గాయాలయ్యాయన్నారు. కూలిన ప్రైవేట్ సెస్నా రకం విమానంలో 10 మంది వరకు ప్రయాణించే వీలుందని, ఘటన సమయంలో అందులో ఎందరున్నారనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. బుధవారం రాత్రి న్యూయార్క్ నగరంలోని టెటెర్»ొరో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకునన ఈ విమానం కన్సాస్ రాష్ట్రం విచిటాలోని కల్నల్ జేమ్స్ జబరా ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగింది.
అనంతరం టేకాఫ్ తీసుకున్న ఈ విమానం శాన్ డియాగోలోని మాంట్‌గోమెరీ–గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్టులో ల్యాండవ్వాల్సి ఉందని సమాచారం. మరో మూడు మైళ్ల ప్రయాణం ఉందనగా ప్రమాదంలో చిక్కుకుందన్నారు. విమానం పైలట్ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు రాలేదని తెలిపారు. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సైనికుల నివాస ప్రాంతముందని చెప్పారు. కాగా, అలాస్కాలోని ఓ కంపెనీకి చెందిన ఈ విమానం 1985లో తయారైంది. సుమారు 4 గంటల సమయంలో దట్టంగా మంచుకురుస్తుండగా విమానం కరెంటు తీగలను తాకడం వల్ల ప్రమాదానికి గురైందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు వివరించారు.