న్యూఢిల్లీ: భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024, ఆగస్టులో పదవీచ్యుతురాలైన హసీనా తొలిసారిగా మౌనం వీడారు. భారత్ వేదికగా ఆమె విడుదల చేసిన తన తొలి బహిరంగ సందేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను నిర్వహించలేదని, ఆ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
వచ్చే ఫిబ్రవరి 12న జరగనున్న బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో, హసీనా ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్‌లో ‘బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే శీర్షికపై జరిగిన కార్యక్రమంలో హసీనా తన ఆడియో సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మహ్మద్ యూనస్‌ను అవినీతిపరుడు, అధికార దాహంతో ఉన్న దేశద్రోహిగా అభివర్ణించారు. తనను పదవి నుండి తొలగించే కుట్రలో యూనస్ ప్రధాన భాగస్వామి అని ఆరోపించారు.
Awami League President Sheikh Hasina's message on the sham election which is being staged by the #YunusRegime in the name of #democracy. pic.twitter.com/UrpjpC6VG6
— Bangladesh Awami League (@albd1971) January 24, 2026
ప్రస్తుత విపత్కర సమయంలో జాతి మొత్తం ఏకమై, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో నిలబడాలని, విదేశీ శక్తులకు తొత్తుగా మారిన యూనస్ ప్రభుత్వాన్ని కూలదోసి, అమరుల రక్తంతో లిఖించిన రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలని హసీనా బంగ్లాదేశ్ పౌరులను కోరారు. యూనస్ పరిపాలనను తరిమికొట్టే వరకూ దేశంలో నిజమైన ఎన్నికలు జరగవని ఆమె వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ జరగాలని హసీనా డిమాండ్ చేశారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మానవ హక్కులను కాలరాస్తున్నారని, మహిళలు, బాలికలపై హింస, లైంగిక దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయని, మతపరమైన మైనారిటీల భద్రతకు పటిష్టమైన హామీ కావాలని ఆమె డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, అవామీ లీగ్ నాయకులపై జరుగుతున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను, అక్రమ అరెస్టులను తక్షణమే ఆపివేయాలని, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఇది కూడా చదవండి: Bangladesh: మోగిన ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 12న పోలింగ్


