మూడో పక్షం జోక్యాన్ని సహించం | Russian President Putin warns 3rd parties against creating no-fly zone over Ukraine | Sakshi
Sakshi News home page

మూడో పక్షం జోక్యాన్ని సహించం

Mar 6 2022 5:21 AM | Updated on Mar 6 2022 5:21 AM

Russian President Putin warns 3rd parties against creating no-fly zone over Ukraine - Sakshi

రష్యా ఎయిర్‌లైన్స్‌ విమాన సిబ్బందితో పుతిన్‌

లెవివ్‌: ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటిస్తే తాము ఎంతమాత్రం అంగీకరించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏదైనా మూడో పక్షం జోక్యం చేసుకుంటే ప్రస్తుత యుద్ధంలో ఆ పక్షాన్ని కూడా భాగస్వామిగానే పరిగణిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌–రష్యా వ్యవహారం లో మూడో పక్షం తలదూర్చవద్దంటూ పరోక్షంగా తేల్చిచెప్పారు. పుతిన్‌ శనివారం రష్యా మహిళా పైలట్లతో సమావేశమయ్యారు.

నో–ఫ్లై జోన్‌ దిశగా ఎవరైనా ముందడుగు వేస్తే వారిని తమ భద్రతా దళాలకు ముప్పుగానే భావిస్తామని, తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని తెలిపారు. ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితికి అక్కడి నాయకులే బాధ్యులని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్‌ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. మరోవైపు తమ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా గుర్తించాలని నాటో దేశాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటినుంచి తమ దేశంలో ఎవరైనా మరణిస్తే  నాటో కారణంగానే మరణించినట్లు భావిస్తామని చెప్పారు.

మూడో దఫా చర్చలకు సిద్ధం
ఉక్రెయిన్‌తో మూడో దఫా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ శనివారం చెప్పారు. తమ వైఖరి స్పష్టంగానే ఉందని, ఉక్రెయిన్‌ వైఖరే నమ్మదగిన విధంగా లేదని తప్పుపట్టారు. రష్యాతో 3వ విడత సోమవారం చర్చలు జరిపాలని ఉక్రెయిన్‌ భావిస్తున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌లో ఆహార సంక్షోభం!
గోధుమల ఎగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే ఉక్రెయిన్‌లో ఇప్పుడు ఆహార కొరత తలెత్తింది. అత్యవసరంగా తమకు 10 బిలియన్‌ డాలర్లు అందజేయాలని ఆమెరికాను జెలెన్‌స్కీ అభ్యర్థించారు.  ఉక్రెయిన్‌లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement