
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న క్రమంలో కూడా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. డోబ్రాపిలియా ప్రాంతంపై జరిగిన మిస్సైల్ దాడిలో 14 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ తూర్పు నగరం డోబ్రాపిలియా, ఖార్కివ్ ప్రాంతంలోని ఒక స్థావరంపై రాత్రిపూట రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు పిల్లలు సహా 37 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
కాగా, రెండు రోజుల క్రితం జెలెన్‌స్కీ సొంత పట్టణంలోని కూడా క్షిపణి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి సమయంలో క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా క్షిపణిదాడిలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్‌లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. 112 షాహెడ్, డెకాయ్ డ్రోన్లను, రెండు బాలిస్టిక్ ఇస్కందర్ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటించింది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ దేశం పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని కూడా అమెరికా నిలిపేసింది. మరో వైపు, ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసిన సంగతి విదితీమే.
గత గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది.
Comments
Please login to add a commentAdd a comment