టీకా టెక్నాలజీ బదిలీకి సిద్ధం

Russia Only Country Ready To Transfer Covid Vaccine Technology - Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

అంతర్జాతీయ వార్తా సంస్థల ఎడిటర్లతో మాటామంతి  

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (రష్యా): రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌–వీ తయారీకి భారతీయ కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యాక్సిన్‌ టెక్నాలజీ బదిలీకి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. విదేశాల్లో కూడా టీకా ఉత్పత్తిని విస్తృతం చేస్తామన్నారు. వ్యాక్సిన్‌ టెక్నాలజీని పంచుకోవడానికి  సిద్ధమైన ఏకైక దేశం రష్యాయేనని చెప్పారు. అమెరికా, భారత్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ వార్తా సంస్థల సీనియర్‌ ఎడిటర్లతో పుతిన్‌ శనివారం ఆన్‌లైన్‌లో సంభాషించారు. పీటీఐ, అసోసియేటెడ్‌ ప్రెస్, రాయిటర్స్‌ తదితర సంస్థల ఎడిటర్లతో మాట్లాడుతూ స్పుత్నిక్‌– వీ సమర్థతపై వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. 97.6 శాతం సామర్థ్యంతో తమ వ్యాక్సిన్‌ పని చేస్తోందని స్పష్టం చేశారు.

యూరప్‌ దేశాల్లో వ్యాక్సిన్‌ కంపెనీల మధ్య పోటీ, వాణిజ్యపరమైన కారణాల వల్ల స్పుత్నిక్‌– వీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే 66 దేశాల్లో స్పుత్నిక్‌– వీని విక్రయిస్తున్నామని, తమ వ్యాక్సిన్‌ మంచి మార్కెట్‌ ఉందన్నారు. స్పుత్నిక్‌– వీ వ్యాక్సిన్‌ తయారీకి సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకి డీసీజీఐ ప్రాథమిక అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే పుతిన్‌ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ రెడ్డి ల్యాబ్స్‌ ఈ వ్యాక్సిన్‌ పంపిణీ బాధ్యతల్ని చేపట్టింది. మరోవైపు అమెరికా సహా కొన్ని దేశాలు కరోనా సంక్షోభానికి చైనాయే కారణమని నిందిస్తున్న అంశంపై అడిగిన ప్రశ్నకు పుతిన్‌ సమాధానమిస్తూ  ఇప్పటికే ఈ విషయంపై చాలా ఎక్కువగా తాను మాట్లాడానని, కొత్తగా చెప్పడానికి ఏమీలేదన్నారు.సంక్షోభాన్ని ఎప్పుడూ రాజకీయం చేయకూడదని హితవు పలికారు.  

మోదీ, జిన్‌పింగ్‌ బాధ్యతాయుత నాయకులు
భారత్, చైనా సరిహద్దు వివాదాల్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని పుతిన్‌ వ్యాఖ్యానించారు. మూడోదేశం ఈ అంశంలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు.  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఎంతో బాధ్యత కలిగిన నాయకులని... సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే సామర్థ్యం వారికుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం... భారత్, రష్యాల రక్షణ బంధంపై ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు భారత్‌తో కూడా తమకు బలీయమైన బంధం ఉందని అన్నారు. రష్యా, భారత్‌ మధ్య బంధం నమ్మకం అనే పునాది మీద ఏర్పడిందని, దానికొచ్చే ఇబ్బందేమీ లేదని చెప్పారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లు క్వాడ్‌ పేరుతో ఒక బృందంగా ఏర్పడడం, భారత్‌ అందులో భాగస్వామ్యం కావడంపై రష్యా విదేశాంగ మంత్రి బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై పుతిన్‌ మాట్లాడుతూ ఏ దేశంతో సన్నిహితంగా మెలగాలి, ఎంతవరకు సంబంధాల్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకునే హక్కు ప్రతీ సార్వభౌమ దేశానికి ఉంటుందని, దానిని ఎవరూ కాదనలేరని వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top