
సస్పెన్షన్‌కు గురైన గంటల్లోనే ఘటన
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా గత వారం రాజధాని మాస్కోతోపాటు, సెయింట్ పీట ర్స్‌బర్గ్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. వేలాదిగా ప్రయాణికులు గంటలపాటు విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ సోమవారం రవాణా శాఖ మంత్రి రొమాన్ స్టరొవోయ్(53)ను సస్పెండ్ చేశారు.
డిప్యూటీ మంత్రి ఆండ్రీ నికిటిన్‌కు రవాణా శాఖ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే స్టరొవోయ్ తన నివాసంలో తుపాకీ గాయాలతో విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 2024 మేలో రవాణా శాఖ మంత్రిగా స్టరొవోయ్ బాధ్యతలు చేపట్టారు.