రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నాటో ఒక చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. యూరోపియన్ సరిహద్దుల వెంబడి సైనికులతో పనిలేకుండా, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రోబోటిక్ "ఆటోమేటెడ్ జోన్"ను నాటో ఏర్పాటు చేయబోతుంది.
ఈ విషయాన్ని నాటో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ థామస్ లోవిన్ శనివారం వెల్లడించారు. ఈ ఆటోమేటెడ్ జోన్ ఒక రక్షణ గోడలా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ ఆటోమేటెడ్ జోన్‌లోకి శత్రు సైన్యం ప్రవేశిస్తే గుర్తించడానికి డ్రోన్లు, సెమీ-అటానమస్ యుద్ధ వాహనాలు, భూమిపై నడిచే రోబోలు, ఆటోమేటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అత్యాధునిక సెన్సార్లు ఉంటాయి.
ఇవి శత్రువుల కదలికలను సెకన్లలో పసిగడతాయి. వెంటనే నాటోదేశాలకు సమాచారం అందుతుంది. అయితే ప్రాణాంతకమైన ఆయుధాలను ప్రయోగించాలా వద్దా అనే నిర్ణయం మాత్రం మనిషి చేతుల్లోనే చేతుల్లోనే ఉంటుందని వెల్ట్ ఆమ్ సోన్‌టాగ్ అనే జర్మన్ వార్తాపత్రికతో లోవిన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ సాంకేతికతను పోలాండ్ మరియు రోమేనియా దేశాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. 2027 చివరి నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నాటో లక్ష్యంగా పెట్టుకుంది.


