
గత నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు
12 దేశాల్లో నమోదైన కొత్త రికార్డ్
నైజీరియా నుంచి జపాన్ దాకా.. పాకిస్తాన్ నుంచి స్పెయిన్ దాకా గత నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 దేశాల్లో కొత్త రికార్డులు సృష్టించాయి. మరో 26 దేశాల్లో బాగా వేడి నెలగా జూన్ రికార్డుకెక్కింది. యూరోపియన్ మానిటర్ కోపరి్నకస్ సంస్థకు చెందిన ఏఎఫ్‌పీ విశ్లేషణ ఈ విషయం వెల్లడించింది. యూరప్, ఆసియా, ఆఫ్రికాలో గత నెలలో 79 కోట్ల మంది వేడి ముప్పును ఎదుర్కొన్నారు. బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా తదితర 26 దేశాల్లో రెండో అత్యంత వేడి నెలగా జూన్ రికార్డు సృష్టించింది. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగానే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరప్‌లో గత నెలలో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిస్, బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో జనం అల్లాడిపోయారు. స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్, బోస్నియా, మాంటెనిగ్రోలోనూ ఇదే పరిస్థితి.
ఆసియా–పరిఫిక్ ప్రాంతంలో సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కోస్తా తీర ప్రాంతాల్లో 1.2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. జపాన్ ప్రజలు హాటెస్ట్ జూన్‌ను చవిచూశారు. దేశంలో 126 ఏళ్ల క్రితం ఉష్ణోగ్రతలను నమోదు చేయడం మొదలైంది. అప్పటి నుంచి అత్యంత వేడి జూన్ నెల ఇదే కావడం గమనార్హం.
ఉభయ కొరియా దేశాల్లోనూ సాధారణం కంటే 2 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. హాటెస్ట్ జూన్‌గా నిలిచిపోయింది.
చైనాలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్‌లో ఈ స్థాయిలో సూర్యప్రతాపం కనిపించడం ఇదే మొదటిసారి.
ఆసియాలోని పాకిస్తాన్, తజకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్‌లోనూ జూన్ నెల అత్యంత వేడి వసంత కాలంగా నిలిచింది.
నైజీరియాలో రికార్డ్–బ్రేకింగ్ స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్, కామెరూన్, కాంగో, ఇథియోపియాలోనూ ఇలాంటి పరిణామమే ఎదురయ్యింది.
– సాక్షి, నేషనల్ డెస్క్