
కీలక విభాగాలకు అధికారాలు పంపిణీ చేస్తున్న జిన్‌పింగ్
పొలిటికల్ బ్యూరో భేటీలో నిర్ణయం
బీజింగ్: చైనాలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శకం ముగిసిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 12 ఏళ్లుగా ఇనుప పిడికిలితో దేశాన్ని పాలిస్తున్న ఉన్న ఆయన నెమ్మదిగా అధికారాన్ని పార్టీలోని కీలక విభాగాలకు అప్పగించడం ప్రారంభించారు. దాంతో చైనాలో అధికార మార్పిడి రంగం సిద్ధమైనట్టు కన్పిస్తోంది. 24 మందితో కూడిన అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ)పొలిటికల్ బ్యూరో జూన్ 30న సమావేశమైంది.
పార్టీలోని వివిధ సంస్థల పనులపై నిబంధనలను సమీక్షించింది. ఆయా సంస్థలు ప్రభావవంతమైన నాయకత్వాన్ని, సమన్వయాన్ని ప్రదర్శించాలని, ప్రధానమైన పనుల ప్రణాళికతోపాటు చర్చించడం, పర్యవేక్షించడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ అధీనంలోని వార్తా సంస్థ జిన్హువా తెలపడంతో అధికార మార్పిడి గురించి ఊహాగానాలు చెలరేగాయి.
పార్టీ సంస్థలపై నిబంధనలు జిన్‌పింగ్ పదవీ విరమణ దిశగా సన్నాహాలను సూచిస్తున్నాయని పార్టీలోని కీలక సభ్యుడు ఒకరు తెలిపారు. సీపీసీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్ పెద్ద సమస్యలపై దృష్టి పెట్టడానికి కొన్ని అధికారాలను ఇలా ఇతరులకు అప్పగిస్తున్నారని కొందరంటున్నారు. ఆదివారం రియో డి జనీరోలో మొదలైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా జిన్‌పింగ్ హాజరలేదు.
ఈ సమావేశానికి ఆయన గైర్హాజరవ్వడం గత 12 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2012లో సీపీసీ జనరల్ సెక్రటరీగా జిన్‌పింగ్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పాలనపై వేగంగా పట్టుసాధించారు. చైనాలో అతిపెద్ద అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తూ, అధికార నిర్మాణాలను తన చేతిలోకి తెచ్చుకున్నారు. పది లక్షల మందికి పైగా అధికారులను శిక్షించారు.
డజన్ల కొద్దీ అగ్ర జనరల్‌లను తొలగించారు. పార్టీ ‘ముఖ్య నాయకుడు’గా తనను తాను ప్రకటించుకున్నారు. మావో తరువాత ఈ హోదాను దక్కించుకున్నది జిన్‌పింగ్ మాత్రమే. ఆ తర్వాత నియమాలను సవరించి మరీ చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2022లో పార్టీ జనరల్ సెక్రటరీగా, 2023లో అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి కొనసాగారు. దాంతో బహుశా ఆయన జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగుతారని అంతా భావించారు.