
భారత్, అర్జెంటీనా నిర్ణయం
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీతో ప్రధాని మోదీ భేటీ
కీలక రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయం
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నతస్థాయికి చేర్చాలని తీర్మానం
బ్యూనస్ ఎయిర్స్: తమ ఇరు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యాన్ని మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ నిర్ణయించుకున్నారు. అలాగే రక్షణ, ఇంధనం, అరుదైన ఖనిజాలు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారు. మోదీ, జేవియర్ మిల్లీ శనివారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకొనేలా రెండు దేశాల నడుమ రక్షణ రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
రెండు దేశాల వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని మోదీ, జేవియర్ మిల్లీ తీర్మానించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం అర్జెంటీనాకు చేరుకున్నారు. భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం గత 57 ఏళ్లలో ఇదే మొదటిసారి. జేవియర్ మిల్లీతో సమావేశం అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యవసాయం, రక్షణ, ఇంధనంతోపాటు పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించామని తెలిపారు.
ఫార్మాస్యూటికల్స్, క్రీడలు తదితర రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జేవియర్‌తో మిల్లీతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. భారత్–అర్జెంటీనా మధ్య గత 75 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ఐదేళ్ల క్రితం ఈ సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి వృద్ధి చెందాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇరుదేశాల ఉమ్మడి ప్రయాణం మరింత అర్థవంతంగా, ప్రగతిశీలకంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం
వ్యవసాయ రంగంలో మరింతగా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ, మిల్లీ అభిప్రాయపడ్డారు. ఒక దేశానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులను మరో దేశంలో ప్రజలకు సులువుగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దీనివల్ల ఇరుదేశాల రైతులకు లబ్ధి చేకూరుతుందని వారు అంగీకరించారు. ఇందుకోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ఆ దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు.
అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాని మోదీకి బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎజీజా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అధికారులతోపాటు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మారి్టన్ స్మారకం వద్ద మోదీ నివాళులరి్పంచారు. భారత్–అర్జెంటీనా మధ్య దశాబ్దాలుగా చక్కటి మైత్రి కొనసాగుతోంది.
2019లో అప్పటి అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రీ ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో భారత్, అర్జెంటీనా మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచారు. వాణిజ్యం, రక్షణ, అరుదైన ఖణిజాలు, చమురు, గ్యాస్, అణు ఇంధనం, వ్యవసాయం, సాంస్కృతికం, టెక్నాలజీ వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నాయి.