మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తిన పుతిన్‌

PM Modi A Patriot, Future Belongs To India: Russia President Putin - Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత ప్రధాని మోదీ స్వతంత్ర విధేశాంగ విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ నిజమైన దేశభక్తుడని, ఆయన సారథ్యంలో భారత్‌ చాలా పురోగతి సాధించిందని కొనియాడారు. మాస్కోకు చెందిన వాల్‌డై డిస్కషన్‌ క్లబ్‌ వార్షిక ప్రసంగంలో పుతిన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మోదీ నాయత్వంలో భారత్‌లో అనేక మంచి పనులు జరిగాయి. ఆయన అసలైన దేశ భక్తుడు. మోదీ ‘మేకిన్‌ ఇండియా’ ఆలోచన ఆర్థికంగా, నైతికంగా చాలా కీలకమైంది. భవిష్యత్తు భారత్‌దే. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్‌ గర్వించాలి.’ అని పేర్కొన్నారు

ఇండియా అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. బ్రిటిష్‌ వలస పాలన నుంచి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం అద్భుతమని రష్యా అధ్యక్షుడు అన్నారు. దాదాపు 1.5 బిలియన్ల(150 కోట్లు) ప్రజలు,  ఖచ్చితమైన అభివృద్ధి కారణంగా భారత్‌ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని, అభిమానిస్తారని పేర్కొన్నారు. భారత్‌, రష్యా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని స్పష్టం చేశారు.రెండు దేశాల మధ్య అనేక దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.
చదవండి: Ukraine-russia war: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్‌

భారత్‌, రష్యా మధ్య ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులు రాలేదని.. ఎల్లప్పుడూ ఒకరికొకరం మద్దతుగా నిలిచామని తెలిపారు. ప్రస్తుతం అదే కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగుతోందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యవసాయం కోసం ఎరువుల సరఫరాను పెంచాలని మోదీ కోరారని.. ఇందుకు తాము 7.6 రెట్లు సరఫరా పెంచినట్లు తెలిపారు. వ్యవసాయంలో వ్యాపారం దాదాపు రెండితలు పెరిగిందని ‍పుతిన్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు పశ్చిమ దేశాల వైఖరిపై పుతిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంపై పెత్తనం కోసం పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని మండిపడ్డారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ(డర్టీ గేమ్‌) ఆడుతున్నాయంటూ అమెరికా, మిత్ర పక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు.  వాటి చర్యలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తాయని హెచ్చరించారు.
చదవండి: డేంజర్స్‌ డర్టీ గేమ్‌కి ప్లాన్‌... పుతిన్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top