‘ధారావి మోడల్’‌ను అనుసరించనున్న ఫిలిప్పీన్స్‌!

Philippines Government To Follow India Dharavi Model To Fight Covid 19 - Sakshi

ముంబై/మనీలా: పది లక్షలకు పైగా జనాభా కలిగి, ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావిలో కరోనా కట్టడి చేసిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. అత్యధిక జన సాంద్రత గల ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, కరోనా మహోగ్రరూపం దాలిస్తే భారీగా ప్రాణ నష్టం చవిచూడాల్సి వస్తుందని మొదట్లో అంతా భయపడ్డారు. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌ విధానం ద్వారా బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) మూడు నెలల్లోనే మహమ్మారి వ్యాప్తిని నియంత్రించగలిగింది. ఈ నేపథ్యంలో ధారావి మోడల్‌ను ప్రశంసిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)  చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 విజృంభిస్తున్న వేళ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలమనడానికి ధారావి అతి పెద్ద ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.(కరోనా: ధారావిపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు) 

ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం కరోనా కట్టడికై ‘ధారావి మోడల్‌’ను అనుసరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి.. ‘‘ఛేజ్‌ ది వైరస్‌ పాలసీ’’ బ్లూప్రింట్‌ను బీఎంసీ ఫిలిప్పీన్స్‌తో పంచుకున్నట్లు బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చహల్‌ ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రయత్నాలకు దక్కిన గౌరవంగా దీనిని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాపించి తొలినాళ్లలో భారత్‌ ఇతర దేశాల కోవిడ్‌ కట్టడి మోడల్‌ను ఆచరిస్తే.. ఇప్పుడు విదేశాలు ధారావి మోడల్‌ను ఫాలోకావడం సంతోషంగా ఉందన్నారు. కాగా బీఎంసీ అధికారులు చెబుతున్న గణాంకాల ప్రకారం ధారావిలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి 0.8 శాతానికి తగ్గింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 81 శాతానికి చేరుకుంది. గతంతో పోలిస్తే కోవిడ్‌ మరణాల రేటులో కూడా తగ్గుదల నమోదైంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top