కరోనా: ధారావిపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

WHO Chief Applauds Mumbai Dharavi Covid 19 Containment Strategy - Sakshi

జెనీవా: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో మహమ్మారి కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాంతక వైరస్‌పై విజయం సాధించగలమని ధారావి నిరూపించిందని కొనియాడింది. కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ, వైరస్‌ బారిన పడిన వారికి తక్షణ చికిత్స, ఐసోలేషన్‌ నిబంధనల అమలు వైరస్‌ గొలుసును బ్రేక్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ప్రజల భాగస్వామ్యం ఉంటే వైరస్‌పై విజయం సాధించవచ్చని సూచించింది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో  డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గేబ్రియేసస్‌ ఈ మేరకు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు.(గాలి ద్వారా కరోనా సాధ్యమే)

జెనీవాలో నిర్వహించిన వర్చువల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా గత ఆరు వారాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే అత్యధిక జనసాంద్రత కలిగిన కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ను కట్టడి చేసిన తీరు గమనిస్తే.. కేసులు పెరిగినా మహమ్మారిని అదుపులోకి తీసుకు రావొచ్చనే విషయం స్పష్టమైంది. ఇందుకు ఇటలీ, స్పెయిన్‌, దక్షిణ కొరియా దేశాలు సహా ముంబైలోని ధారావి వంటి ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించిన తీరే నిదర్శనం. పరీక్షలు నిర్వహణ, ట్రేసింగ్‌, ఐసోలేషన్‌, అనారోగ్యంతో ఉన్న వారికి తక్షణ చికిత్స అందించడం వంటి విధానాలు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేశాయి. మమమ్మారిని అణచివేయగలమని నిరూపించాయి’’ అని పేర్కొన్నారు. 

ధారావి విజయం
పదిలక్షల మందికి పైగా నివసించే ధారావిలో కరోనా విజృంభించిన తొలినాళ్లలో అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై పురపాలక సంస్థ(బీఎంసీ) సత్వర చర్యలు చేపట్టింది. కమ్యూనిటీ హెల్త్‌ కేర్‌ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని అక్కడికి పంపి ఈ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలిగింది. ఈ క్రమంలో శుక్రవారం నాటికి ధారావిలో  మొత్తంగా 2359 కేసులు వెలుగు చూడగా.. ప్రస్తుతం కేవలం అక్కడ 166 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉండటం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో అత్యధికంగా 27 వేల కేసులు నమోదు కాగా.. ధారావిలో 35 మంది కరోనా బారిన పడ్డారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top