ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష | Paris court gives Indian man 20 years prison sentence | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

Oct 11 2026 6:12 AM | Updated on Oct 11 2026 6:12 AM

Paris court gives Indian man 20 years prison sentence

బాలికలకు ఎర..లైంగిక చర్యలకు బలవంతం 

క్రూరమైన హింసాత్మక వీడియోలు 

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక గ్రూపు 

ఐదు రోజుల్లో విచారణ, శిక్ష ఖరారు

ప్యారిస్‌: మైనర్‌ బాలికలతోపాటు చిన్న వయసు యువతులను బలవంతంగా లైంగిక కార్యకలాపాలకు వాడుకున్న ఓ భారతీయ వ్యక్తికి ప్యారిస్‌ కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్షవిధించినట్లు అధికారులు తెలిపారు. రోహన్‌ రాణే అని పిలిచే ఈ వ్యక్తి కేసు విచారణ ప్రత్యేక క్రిమినల్‌ కోర్టు ముందు సోమవారం మొదలైంది. శుక్రవారం తీర్పు ఆదేశాలు జారీ అయ్యాయి. చదువుకునేందుకు ఫ్రాన్స్‌ వచ్చిన రాణే అమెరికా, బ్రిటన్, కెనెడాలకు చెందిన పలువురు బాలికలు, అమ్మాయిలను ట్రాప్‌ చేసి హింసాత్మకమైన లైంగిక చర్యల వీడియోలు తీసేలా బలవంతపెట్టాడని అధికారులు తమ నివేదికలో తెలిపారు. 

ఈ నేరాలకుగాను అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరగా న్యాయస్థానం మాత్రం ఇరవై ఏళ్ల శిక్ష విధించింది. రాణే నాజీలను ఇష్టపడే, ఇతరులను హింసించి ఆనందం పొందే వ్యక్తి అని, భయానకమైన అతిహింసను కూడా ఇష్టపడతాడని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానంలో వివరించారు. రాణే నేతృత్వంలోని గ్రూపులో సుమారు డజనుకుపైగా బాధితులు అమెరికాకు చెందిన వారు. వీరిలో అధికులు 15 కంటే తక్కువ వయసు ఉన్న వారు. ఈ గ్రూపులోని యువకులు అమెరికా, భారత్, జర్మనీ, న్యూజీల్యాండ్‌లకు చెందిన వారని ఫ్రాన్స్‌ 24 కథనం తెలిపింది. 

బాధితుల్లో ఆరుగురు (ప్రస్తుతం 18 – 21 మధ్య వయసు్కలు) అధికారికంగా ఫిర్యాదు ఇవ్వడంతో రాణే అకృత్యాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. బాధితుల్లో 20 మందిని ఇప్పటికే గుర్తించామని, మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదని న్యాయవాదులు చెప్పారు. ఐదు రోజులపాటు సాగిన విచారణ తరువాత న్యాయస్థానం రాణేను దోషిగా నిర్ధారించింది. బలవంతంగా డబ్బులు గుంజడం, బాధితులను అమానుషంగా హింసించడం వంటి నేరాల్లో రాణే దోషిగా రుజువయ్యాడు. 

ఈ గ్రూపు బాలికలందరినీ ఆకర్షించి నిహిలిజం (జీవితానికి అర్థం లేదా విలువ లేదనే భావజాలం), జాత్యహంకారం, యూదు వ్యతిరేకత, నాజీ సిద్ధాంతాల సౌందర్యం మరియు విలువలు, అలాగే స్త్రీవాదులు ట్రాన్స్‌జెండర్లు, ఇతర లైంగిక అస్తిత్వాల సమాజాల పట్ల ద్వేషం వంటి భావజాలాల ప్రభావంతో నడిచేదని న్యాయవాదులు వివరించారు. కోవిడ్‌–19 సమయంలో సీవీఎల్‌టీ పేరుతో ఈ గ్రూపు డిస్‌కార్డ్‌ ప్లాట్‌ఫామ్‌పై నడిచింది. అమెరికా అధికారులు అందించిన సమాచారం ఆధారంగా రోహన్‌ రాణేను 2021లోనే మొదటిసారి అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement