జమ్మూ–కాశ్మీర్‌లోని మసీదులను భారత్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఆరోపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది. పాకిస్తాన్ సైన్యమే మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ఆరోపించారు.
పాకిస్తాన్‌ను ఆయన బహిరంగంగా ‘ఉగ్రవాద దేశం’గా పేర్కొనడం గమనార్హం. భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే నైతిక హక్కు పాకిస్తాన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో మసీదులు, ఇమాములు, కమిటీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ప్రతిస్పందనగానే ఈ వ్యాఖ్యలు చేశారు.
బలూచిస్తాన్‌లో 40 మసీదుల ధ్వంసం
బలూచ్ జాతీయవాద నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త అయిన మీర్ యార్ బలూచ్ ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం ఇప్పటివరకు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సుమారు 40 మసీదులను ధ్వంసం చేసింది. ఇందులో మసీదులపై నేరుగా బాంబు దాడులు చేయడం, పవిత్ర ఖురాన్‌ను దహనం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.
భారత్‌కు బలూచిస్తాన్ మద్దతు
జమ్మూ–కాశ్మీర్ అంశంపై భారత్ తీసుకుంటున్న సూత్రప్రాయ వైఖరికి బలూచిస్తాన్ రిపబ్లిక్ పూర్తి మద్దతు ఇస్తోందని మీర్ యార్ పేర్కొన్నారు. మత, జిహాదీ తీవ్రవాద శక్తులను ఉపయోగించి హిందువులు సహా మైనారిటీలను అణచివేస్తున్న పాకిస్తాన్, ఇతర దేశాలకు మానవ హక్కులపై పాఠాలు చెప్పడం విడ్డూరమని ఆయన విమర్శించారు.
పాకిస్తాన్‌కు చెందిన “బాహ్య శక్తులు” బలూచిస్తాన్‌లో మసీదులపై బాంబు దాడులు చేయడం, ఖురాన్ దహనం చేయడం, మసీదుల అధిపతులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.
పాకిస్తాన్ ఆక్రమణ సైన్యం ట్యాంకులతో దాడులు జరిపి పౌరులపై షెల్స్, ఫిరంగులు ప్రయోగించినప్పుడు తొలి బలైంది ఖాన్ ఆఫ్ కలత్ మసీదు అని మీర్ యార్ బలూచ్ తెలిపారు. ఆ మసీదులో ఇప్పటికీ మోర్టార్ షెల్స్ మోగిన శబ్దాలు వినిపిస్తాయని, అది పాకిస్తాన్ క్రూరత్వానికి నిదర్శనమని అన్నారు.
మైనారిటీలపై దౌర్జన్యాలు
హిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా అనేక మైనారిటీ వర్గాలు పాకిస్తాన్‌లో నిరంతర హింసకు గురవుతున్నాయన్న విషయం ప్రపంచానికి తెలిసిందేనని మీర్ యార్ బలూచ్ వ్యాఖ్యానించారు. అటువంటి దేశానికి భారత్, బలూచిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌లకు మానవ హక్కులపై ఉపన్యాసాలు ఇచ్చే నైతిక అర్హత లేదని ఆయన తేల్చిచెప్పారు.


