పారిస్: ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు రాకపోకలు సాగించే విమానాల్లో పాకిస్థాన్‌కు చెందిన పైలట్లు, క్యాబిన్ సిబ్బంది విధులు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. దీంతో ఇజ్రాయెల్ విధించిన కొత్త విమానయాన ఆంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఫ్రాన్స్ నిలిచినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌తో పాటు మరో 30 దేశాలకు చెందిన సిబ్బందిపై కూడా ఈ పరిమితులు వర్తిస్తున్నట్లు కథనం వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాల విషయంలో తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఇలాంటి నిబంధనలపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అంతర్జాతీయ విమానయాన రంగంలో ఈ ఆంక్షల ప్రభావం ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇతర విమానయాన సంస్థలు కూడా ఇజ్రాయెల్ నిబంధనలకు అనుగుణంగా ఇలాంటి చర్యలు తీసుకుంటాయా అనే చర్చ మొదలైంది.ఈ ఆంక్షల ప్రకారం, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని కొన్ని దేశాల పౌరసత్వం కలిగినవారు లేదా ఆ దేశాల ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నిర్దిష్ట విమానాల్లో విధులు నిర్వహించడానికి అనుమతి ఉండకపోవచ్చు.
నిషేధం ఎదుర్కొనే దేశాలు?
చి-ఏవియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అంతర్గత షెడ్యూలింగ్ మెమోలో 29 దేశాలకు చెందిన పౌరులు టెల్ అవీవ్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాల్లో విధులు నిర్వహించకుండా నిరోధించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్, అల్జీరియా, బంగ్లాదేశ్, బ్రూనై, కొమొరోస్, క్యూబా, జిబౌటి, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, మలేషియా, మాల్దీవులు, మాలి, మౌరిటానియా, నైజర్, ఉత్తర కొరియా, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, సోమాలియా, సూడాన్, సిరియా, ట్యునీషియా, వెనిజులా, యెమెన్.
విమానాన్ని వెనక్కి పంపిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ కొత్త ఆంక్షల ప్రభావానికి గురైన తొలి విమానంగా మంగళవారం ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నిలిచినట్లు ది జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఆ విమానం ఇథియోపియా గగనతలంలోనే ఉండగా, అందులో ఇండోనేషియాకు చెందిన పైలట్ ఉన్నట్లు గుర్తించిన ఇజ్రాయెల్ అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించాలని ఆదేశించారు. దీంతో విమానం ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు తిరిగి వెళ్లింది. అక్కడ ఆ పైలట్ స్థానంలో మరో పైలట్‌ను నియమించిన అనంతరం విమానం మళ్లీ బయలుదేరి టెల్ అవీవ్‌లో దిగింది.
ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఇండోనేషియాకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. అందువల్ల ఆ దేశ పౌరులు కూడా ఇజ్రాయెల్ విధించిన విమానయాన ఆంక్షల పరిధిలోకి వస్తారు.ఈ ఘటనపై ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ, ఇది పొరపాటున జరిగినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాన్ని నడపడానికి ఆ పైలట్‌కు అనుమతి లేదనే విషయం తమకు ముందుగా తెలియదని పేర్కొంది.
ఇదీ చదవండి: ట్రంప్ డిపాజిషన్ వాయిదా


