పరువు నష్టం కేసు.. ట్రంప్ డిపాజిషన్ వాయిదా! | Donald Trump Postpones Deposition In $10 Billion BBC Defamation Lawsuit As Legal Battle Continues, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పరువు నష్టం కేసు.. ట్రంప్ డిపాజిషన్ వాయిదా!

Oct 14 2026 3:09 PM | Updated on Oct 14 2026 3:22 PM

Donald Trump cancel his BBC defamation lawsuit deposition

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై దాఖలు చేసిన 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 16న జరగాల్సిన ట్రంప్ డిపాజిషన్‌ వాయిదా పడింది. దేశానికి ప్రాముఖ్యమైన అనేక ఇతర పనుల కారణంగా ఆయన కోర్టుకు హాజరుకాలేరని ట్రంప్ తరఫు న్యాయవాదులు తెలిపారు.

అయితే ట్రంప్ విచారణను నిరవధికంగా వాయిదా వేయలేరని పేర్కొంటూ బీబీసీ.. కోర్టును ఆశ్రయించింది. డిసెంబర్ నెల మధ్య వరకు ట్రంప్ అందుబాటులో ఉండరని, విచారణను జనవరికి వాయిదా వేయాలని ఆయన న్యాయవాదులు సూచించినట్లు బీబీసీ వెల్లడించింది. విచారణ గడువు ముగియడానికి మరో రెండు నెలల గడువు మాత్రమే ఉన్నందున, ట్రంప్ వాంగ్మూలానికి కచ్చితమైన తేదీని నిర్ణయించాలని న్యాయమూర్తిని కోరింది.

అసలు కేసు ఏమిటంటే?
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ హింసకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రసంగంలోని దృశ్యాలను బీబీసీ ఓ డాక్యుమెంటరీలో ఎడిట్ చేసి ప్రసారం చేసిందని ట్రంప్ ఆరోపించారు. ఆ ఎడిటింగ్ వల్ల తాను హింసను ప్రేరేపించినట్లు ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగిందని పేర్కొంటూ 2025 డిసెంబర్‌లో బీబీసీపై కేసు వేశారు. జరిగిన ఘటనపై బీబీసీ క్షమాపణలు చెప్పింది, ట్రంప్‌కు పరువు నష్టం కలిగించాలనే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేసింది. తొలుత 10 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరిన ట్రంప్, అనంతరం తన ప్రతిష్ఠకు జరిగిన నష్టానికే పరిమితమయ్యారు. ఈ కేసు వ్యవహారంపై కోర్టులో వచ్చే వారం విచారణ జరగనుంది.

ఇదీ చదవండి: లడఖ్‌పై చైనాకు భారత్ గట్టి కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement