
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని, ఉగ్రవాదులను పెంచిపోషించడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం నమ్మబలుకుతోంది. తమ దేశంలో ఉగ్రవాదుల క్యాంపులే లేవని కబుర్లు చెబుతోంది. అబద్ధాలతో ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. కానీ, పాక్ అసలు రంగు ప్రత్యక్షంగా బయటపడింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలు బుధవారం జరిగాయి.
పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లో ముష్కరుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ సైనికాధికారులు, జవాన్లు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొనడం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాహోర్ సమీపంలోని మురిడ్కేలో ముగ్గురు ఉగ్రవాదులు అబ్దుల్ మాలిక్, ఖలీద్, ముదాస్సిర్‌ల అంత్యక్రియల్లో లష్కరే తోయిబా సభ్యుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ప్రార్థనలు చేశాడు.
ఈ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సైనికాధికారులు, పోలీసులు హాజరయ్యారు. పాకిస్తాన్ జాతీయ జెండాతో చుట్టిన ఉగ్రవాదుల శవపేటికలను సైనికాధికారులు, జవాన్లు స్వయంగా మోశారు. ప్రార్థనల అనంతరం ఖననం కోసం మృతదేహాలను ఉగ్రవాదుల స్వస్థలాలకు పంపించారు. పీఓకేలోని ముజఫరాబాద్‌లో జరిగిన అంత్యక్రియల్లోనూ పాక్ అధికారులు హాజరైనట్లు తెలిసింది.