విద్యార్థుల వీసాలపై పిడుగు  | Over 1000 international students have had visas or legal status revoked | Sakshi
Sakshi News home page

విద్యార్థుల వీసాలపై పిడుగు 

Apr 19 2025 5:22 AM | Updated on Apr 19 2025 8:47 AM

Over 1000 international students have had visas or legal status revoked

నెలలో 1,024 వీసాలు రద్దు 

లీగల్‌ రెసిడెన్సీ స్టేటస్‌ సైతం 

విదేశీయులపై అమెరికా కఠిన వైఖరి  

డిపోర్టేషన్‌ ముప్పు, కోర్టుకెక్కుతున్న బాధితులు 

అరెస్టు భయంతో స్వదేశాలకు వెళ్లిపోతున్న వైనం 

విదేశీ విద్యార్థులపై అమెరికా కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,024 మంది విదేశీ విద్యార్థుల వీసాలనో, వారి లీగల్‌ రెసిడెన్సీ స్టేటస్‌నో రద్దు చేసింది. వారంతా అమెరికాలోని 160 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నవారే. వారంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఇలా ఉన్నపళంగా వెళ్లగొట్టడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ‘‘చట్టప్రకారం అన్ని అనుమతులూ ఇచ్చిన ప్రభుత్వమే ఆ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఈ చర్యలను ఎలా సమర్థించుకుంటుంది?’’ అని ప్రశి్నస్తున్నారు. ట్రంప్‌ ప్రభుత్వ చర్యపై పలువురు కోర్టుకెక్కారు. కొందరు అరెస్టు భయంతో చదువులు మధ్యలోనే వదిలేసి స్వదేశాలకు వెళ్లిపోయారు. 

పునరాలోచించాలి 
లీగల్‌ స్టేటస్‌ రద్దుతో వందలాది మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమెరికా వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ప్రభుత్వమే నిర్బంధించి బలవంతంగా వెళ్లగొట్టే పరిస్థితి నెలకొంది. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్, ఒహాయో స్టేట్‌ వర్సిటీల్లోని పలువురు విద్యార్థుల లీగల్‌ స్టేటస్‌లు రద్దయ్యాయి. పలు కాలేజీల్లోని విద్యార్థులు వీసాలు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీపై కోర్టుల్లో కేసులు దాఖలవుతున్నాయి. విదేశీ విద్యార్థులు ఇలా వెళ్లిపోతే అమెరికా వర్సిటీలు, కాలేజీల మనుగడ కష్టమవుతుందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. దీనిపై పునరాలోచించాలని ట్రంప్‌ సర్కారుకు సూచిస్తున్నారు. కాలేజీలు, వర్సిటీల నుంచి కూడా ఈ మేరకు విజ్ఞాపనలు వెళ్తున్నాయి. 

రద్దయితే ఇంటికేనా? 
ఎఫ్‌–1 విద్యార్థి వీసాలను అమెరికా విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టాక వారి లీగల్‌ రెసిడెన్సీ స్టేటస్‌ను పర్యవేక్షించే బాధ్యత డీఓహెచ్‌దే. విద్యార్థుల డేటాబేస్‌ దానివద్ద ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యి వారు స్వదేశాలకు వెళ్లాక వర్సిటీ సూచనతో లీగల్‌ స్టేటస్‌ను తొలగించేవారు. ఇప్పుడు వర్సిటీలతో సంబంధమే లేకుండా విదేశీ విద్యార్థుల లీగల్‌ రెసిడెన్సీ స్టేటస్‌ ఉన్నపళంగా రద్దయిపోతోంది. పైగా ఆ మేరకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. డేటాబేస్‌ను వర్సిటీ వర్గాలు తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఆ విషయం తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో వీసా రద్దయినా లీగల్‌ రెసిడెన్సీ స్టేటస్‌ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. స్వదేశాలకు వెళ్లి మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్‌ రద్దయితే మాత్రం అమెరికాలో ఉండడానికి అనుమతించరు. స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచిస్తారు. లేదంటే బలవంతంగా పంపిస్తారు.

ఎందుకీ వీసాల రద్దు? 
→ విద్యార్థుల వీసాల రద్దుకు నిబంధనల ఉల్లంఘన ముఖ్య కారణమని వర్సిటీలు చెబుతున్నాయి. 
→ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా వీసా రద్దవుతోంది. గత ఉల్లంఘనలకు కూడా ఇప్పుడు వీసా రద్దు చేస్తున్నారు. 
→ చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినా వీసా రద్దు తప్పదు. 
→ పాలస్తీనా సానుభూతిపరుడంటూ కొలంబియా వర్సిటీ విద్యార్థి మహమ్మద్‌ ఖలీల్‌ వీసా రద్దు చేశారు. కానీ వీసాలు, లీగల్‌ స్టేటస్‌లు రద్దవుతున్న పలువురు విద్యార్థులకు ఉద్యమాలతో, తీవ్రవాద/ఉగ్రవాద సంస్థలతో ఏ సంబంధమూ లేదని ఆయా వర్సిటీలే చెబుతున్నాయి. కారణాలేమిటో ప్రభుత్వాన్నే అడగాలంటున్నాయి. 
→ ‘‘విదేశీ విద్యార్థులను బయటకు వెళ్లగొట్టడమే డీఓహెచ్‌కు పనిగా మారింది. ఈ మేరకు అనధికారింగా జాతీయ పాలసీ తె
చ్చినట్టు కనిపిస్తోంది’’ అని వేన్‌ స్టేట్‌ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ ప్రతినిధులు విద్యార్థుల తరఫున కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలవంతపు డిపోర్టేషన్లు ఆపాలని కోరారు. 
→ డార్ట్‌మౌత్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న చైనాకు చెందిన షియాంటియాన్‌ లియూ తన లీగల్‌ స్టేటస్‌ రద్దుపై కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ విద్యారి్థకి అనుకూలంగా న్యూ హ్యాంప్‌షైర్‌ ఫెడరల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. 
→ ‘‘అమెరికాలోకి వచ్చిపడుతున్న విదేశీయుల పట్ల ట్రంప్‌ గుర్రుగా ఉన్నారు. వారందరినీ వెనక్కు పంపేయాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే విదేశీ విద్యార్థులను లక్ష్యం చేసుకుంటున్నారు’’ అని మైగ్రేషన్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో పబ్లిక్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ మిషెల్‌ మిటెల్‌స్టాడ్‌ అన్నారు.

తీవ్ర పరిణామాలే
అమెరికాలో చట్టాల అమలు కఠినంగా ఉంటుంది. వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘‘విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. చట్టాలను ధిక్కరిస్తామంటే ప్రభుత్వం సహించదు. ఇష్టానుసారం వ్యవహరిస్తే వీసాలు రద్దు చేసి వెనక్కు పంపుతారు. నిజాయితీగా ఉండేవారికి అమెరికాలో అద్భుత అవకాశాలున్నాయి’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్‌ మెక్‌లియోడ్‌ అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఇకనైనా మొద్దునిద్ర వీడి అమెరికాలోని మన విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్‌ పార్టీ సూచించింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement