టైటాన్‌ ప్రమాదం వెనుక భయంకర నిజాలు! | Oceangate CEO Planned To Die In Titan Implosion | Sakshi
Sakshi News home page

టైటాన్‌ ప్రమాదం వెనుక భయంకర నిజాలు!

Oct 21 2026 1:00 PM | Updated on Oct 21 2026 1:07 PM

Oceangate CEO Planned To Die In Titan Implosion

బిలియనీర్లను సముద్ర గర్భంలోకి తీసుకెళ్లిన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ ప్రయాణం మృత్యు యాత్రగా ముగియడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘోర ప్రమాదం వెనుక మరో షాకింగ్‌ కోణాన్ని తెరపైకి తెచ్చారు ఓషన్‌గేట్‌ సీఈవో స్టాక్‌టన్‌ రష్‌ సన్నిహిత మిత్రుడు కార్ల్‌ స్టాన్లీ. టైటానిక్‌ శిథిలాల వద్దే మరణించి చరిత్రలో నిలిచిపోవాలనే కోరిక రష్‌కు ఉండేదని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంతకీ టైటాన్‌ ప్రమాదం వెనుక ఏం జరిగింది? రష్‌ ఉద్దేశాలపై ఆయన మిత్రుడు చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?

వాణిజ్య సబ్‌మెర్సిబుల్స్ రంగంలో నిపుణుడైన స్టాన్లీ.. టైటాన్‌ శిథిలాలు సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 12,500 అడుగుల లోతులో ఉన్నాయని, అక్కడికి వెళ్లే సమయంలో తాను మరణించే ఉద్దేశంతోనే రష్ ఆ వాహనాన్ని రూపొందించి ఉండవచ్చని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ఈ అనుమానాలను ఆయన వెల్లడించారు.

తన కొత్త పుస్తకం ‘సబ్‌మర్స్డ్: వండర్, అబ్సెషన్ అండ్ మర్డర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ అమెచ్యూర్ సబ్‌మెరైన్’ కోసం రచయిత మాథ్యూ గావిన్ ఫ్రాంక్‌తో మాట్లాడుతూ స్టాన్లీ ఇలా అన్నారు. నిజానికి ఆయన మంచి ఇంజినీర్. ఆ యంత్రం అతను రూపొందించిన విధంగానే పనిచేసింది. రష్ అహంకారం చాలా ఎక్కువగా ఉండేదని.. అతను టైటాన్‌ శిథిలాల వద్దకు వెళ్లి చనిపోవాలని కోరుకున్నాడు. ఎంత మంది దృష్టిని ఆకర్షిస్తే అంత మంచిదని భావించాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. 2023 జూన్‌లో టైటాన్ సబ్‌మెర్సిబుల్ తీవ్ర ఒత్తిడి కారణంగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న ఓషన్‌గేట్ సీఈవో స్టాక్‌టన్ రష్‌తో పాటు ఐదుగురూ మరణించారు.

స్టాక్‌టన్ రష్‌తో పదేళ్లకు పైగా పరిచయం ఉన్న కార్ల్ స్టాన్లీ.. 2019లో రష్‌తో కలిసి ఒక పరీక్షా డైవ్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో సబ్‌మెర్సిబుల్ నుంచి పెద్ద శబ్దాలతో పగుళ్లు వస్తున్నట్లు వినిపించాయని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, తాను వ్యక్తం చేసిన ఆందోళనలను రష్ పట్టించుకోలేదని స్టాన్లీ పేర్కొన్నారు. రచయిత మాథ్యూ గావిన్ ఫ్రాంక్ తన పుస్తకంలో రష్ ఉద్దేశాల గురించి మరింత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రష్ తన మరణంతోనే ఆగకుండా, ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేలా ఒక పనికిరాని వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా తయారు చేసి.. దానికి టైటానిక్‌ను గుర్తుచేసే పేరు పెట్టారని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవండి: మునీర్‌ దౌత్యం వేళ షాకిచ్చిన ఇరాన్‌.. అమెరికాకు కొత్త టెన్షన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement