మునీర్‌ దౌత్యం వేళ షాకిచ్చిన ఇరాన్‌.. అమెరికాకు కొత్త టెన్షన్‌! | Iran Shocks During Munir Diplomatic Mission And New Tensions for US | Sakshi
Sakshi News home page

మునీర్‌ దౌత్యం వేళ షాకిచ్చిన ఇరాన్‌.. అమెరికాకు కొత్త టెన్షన్‌!

Oct 21 2026 8:12 AM | Updated on Oct 21 2026 8:34 AM

Iran Shocks During Munir Diplomatic Mission And New Tensions for US

అమెరికాతో దౌత్య చర్చలకు ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నా.. మరోవైపు ఇరాన్‌ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిస్తోంది. అణు కార్యక్రమం విషయంలో రాజీ పడేది లేదని, తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంలో ఒక్క గ్రాము కూడా దేశం దాటి వెళ్లబోదని తెగేసి చెబుతోంది. అమెరికా తమపై విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లను పక్కనపెట్టి.. ముందుగా తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని స్పష్టం చేస్తోంది. 

దీంతో ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు పాకిస్థాన్‌ చేస్తున్న ప్రయత్నాలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హార్ముజ్‌ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ తాజా ప్రకటన అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒక్క గ్రాము కూడా బయటకు వెళ్లదు!
యురేనియం నిల్వలను విదేశాలకు తరలించే అంశంపై ఇరాన్‌ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్‌ రెజాయీ కీలక ప్రకటన చేశారు. ‘శుద్దిచేసిన యురేనియంలో ఒక్క గ్రాము కూడా ఇరాన్‌ నుంచి బయటకు వెళ్లదు. అమెరికా విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు తీసుకునే వరకు చర్చలు ఉండవు. ఇరాన్‌ విధించిన షరతులన్నింటినీ పూర్తిగా అమలు చేయడంతోనే ఆ ప్రక్రియ ప్రారంభం కావాలి’ అని ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ వైఖరిని కూడా రెజాయీ పునరుద్ఘాటించారు. అణు ఇంధనాన్ని దేశం నుంచి బయటకు పంపే ప్రతిపాదనలకు తమ ప్రభుత్వం అంగీకరించబోదన్న సంకేతాన్ని మరోసారి ఇచ్చారు. అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా, తమ షరతుల ఆధారంగానే తదుపరి చర్చలు జరగాలన్నది ఇరాన్‌ వైఖరిగా కనిపిస్తోంది.

అమెరికా ముందు ఏడు షరతులు!
అమెరికాతో చర్చలు జరపాలంటే ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్‌ పట్టుబడుతోంది. గత నెలలో హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచే అంశంతో ముడిపెట్టి ఏడు షరతులను ముందుకు తెచ్చినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఖలీబాఫ్‌ సైతం ఆ షరతులు నెరవేరే వరకు అమెరికా తమ విశ్వాసాన్ని తిరిగి పొందలేదని అన్నారు.

ఇరాన్‌ డిమాండ్లలో మూడు కీలక అంశాలు..
1. ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేత: ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధాన్ని తొలగించాలని టెహ్రాన్‌ కోరుతోంది. సముద్ర వాణిజ్యం, రవాణాపై ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తోంది.

2. చమురు ఎగుమతులపై ఆంక్షల తొలగింపు: ఇరాన్‌ చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తోంది. చమురు ఆదాయం ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు కీలకం కావడంతో ఈ అంశంపై వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదని సంకేతాలిస్తోంది.

3. ప్రాంతీయ ఘర్షణలకు ముగింపు: ప్రాంతంలోని అన్ని రంగాల్లో కొనసాగుతున్న దాడులు, శత్రుత్వానికి ముగింపు పలకాలని కోరుతోంది. కేవలం ద్వైపాక్షిక చర్చలకే పరిమితం కాకుండా, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలనూ పరిష్కరించాలని పట్టుబడుతోంది. ఈ డిమాండ్లతోపాటు అణు కార్యక్రమంపై తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ఇరాన్‌ కోరుతోంది.

మునీర్‌ దౌత్యం ఫలించేనా?
ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ ఇరాన్‌లో పర్యటిస్తూ కీలక నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో ఆయన భేటీ అయ్యారు. పార్లమెంట్‌ స్పీకర్‌ ఖలీబాఫ్‌తోనూ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలు, ఇరాన్‌-అమెరికా మధ్య చర్చల పునఃప్రారంభానికి ఉన్న అవకాశాలు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చినట్లు ఇరాన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. రెండు దేశాల మధ్య విభేదాలను తగ్గించి, దౌత్య పరిష్కారానికి మార్గం సుగమం చేయడమే పాకిస్థాన్‌ ప్రయత్నాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే, చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్‌ తన షరతులను స్పష్టం చేయడంతో మధ్యవర్తిత్వం అంత సులభం కాదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా యురేనియం నిల్వలను విదేశాలకు తరలించే అంశంపై ఇరాన్‌ వెనక్కి తగ్గకపోవడం చర్చల్లో కీలక సమస్యగా మారే అవకాశం ఉంది.

గతంలోనూ శాంతి ప్రయత్నాలు.. 
ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు గతంలోనూ పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరిగాయి. జూన్‌లో తాత్కాలిక శాంతి ఒప్పందానికి మార్గం ఏర్పడినప్పటికీ, ఆ తర్వాత ఇరాన్‌-అమెరికా మధ్య పోరాటం తిరిగి ప్రారంభం కావడంతో ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ చర్చల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈసారి ఇరాన్‌ ముందుగానే తన వైఖరిని స్పష్టం చేస్తోంది. ముందుగా అమెరికా తమ డిమాండ్లను నెరవేర్చాలి.. ఆ తర్వాతే చర్చల గురించి ఆలోచిస్తామని చెబుతోంది. అమెరికా మాత్రం ఇరాన్‌ అణు సామర్థ్యాన్ని తగ్గించాల్సిందేనన్న వైఖరిని వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా ఈ పరస్పర విరుద్ధ వైఖరుల మధ్య ఏదో ఒక పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది.

అమెరికా ఆందోళన ఇదే!
ఇరాన్‌ అణు కార్యక్రమమే అమెరికాతో ఒప్పందానికి ప్రధాన అడ్డంకిగా కొనసాగుతోంది. ఇరాన్‌ యురేనియాన్ని 60 శాతం వరకు శుద్ధి చేయడం అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు పలు పాశ్చాత్య దేశాల ఆందోళనలకు కారణమైంది. సాధారణ పౌర అణు అవసరాలకు ఉపయోగించే స్థాయితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ధి స్థాయి సుమారు 90 శాతంగా పరిగణిస్తారు. ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేయాలని ప్రయత్నిస్తోందని అమెరికా, ఇజ్రాయెల్‌, ఇతర పాశ్చాత్య దేశాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని, అణ్వాయుధాల తయారీ తమ లక్ష్యం కాదని ఇరాన్‌ చెబుతోంది.

ప్రస్తుతానికి ఇరాన్‌ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. యురేనియం విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అమెరికా ముందుగా తమ షరతులను నెరవేర్చాలని చెబుతోంది. ఇప్పుడు అమెరికా ఎలా స్పందిస్తుంది? పాకిస్థాన్‌ దౌత్య ప్రయత్నాలు ఫలించి చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయా? లేక అణు కార్యక్రమం, ఆంక్షల అంశాలే ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభనను కొనసాగిస్తాయా? అన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement