తన స్వదేశానికి డిసెంబరులో తిరిగి వెళ్తానంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తనను అరెస్టు చేసినా.. చంపినా.. చిత్రహింసలకు గురిచేసినా వెనక్కి తగ్గబోనంటూ ఆమె వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ కేంద్రంగా జరిగిన మీడియా సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆమె.. తిరిగి రావడం తన బాధ్యత అని.. దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలు తనను అడ్డుకోలేవని చెప్పారు.
2024 ఆగస్టులో తన ప్రభుత్వం కూలిపోయిన అనంతరం బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టిన హసీనా.. స్వదేశానికి తిరిగి వస్తే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి రావచ్చని అంగీకరించారు. అయితే.. రాజకీయ బాధ్యతలో భాగంగా తన మద్దతుదారులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. నేను డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాను. నాకు భయం లేదు. వారు నన్ను చంపవచ్చు.. అరెస్టు చేయవచ్చు.. చిత్రహింసలకు గురిచేయవచ్చని తెలుసు. అయినప్పటికీ తిరిగి వెళ్లడం నా బాధ్యత అన్న హసీనా.. కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు.
అది ఎంత ప్రమాదకరమైనదైనా నాకు పట్టింపు లేదు. నేను తిరిగి వెళ్లాల్సిందేనంటూ హసీనా స్పష్టం చేశారు. అనంతరం ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ విలేకరులతో మాట్లాడుతూ.. తిరిగి వచ్చే తేదీ ఇంకా ఖరారు కాలేదని.. సమయం దగ్గరపడినప్పుడు ప్రకటిస్తామని తెలిపారు. రాజకీయ సంక్షోభ సమయంలో తనకు ఆశ్రయం కల్పించిన భారత్‌కు హసీనా కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం, అన్ని పార్టీలకు చెందిన ప్రజలు నన్ను స్వాగతించి ఆశ్రయం కల్పించారు. అందుకు వారికి కృతజ్ఞతలు. 1975లో జరిగినట్లుగానే వారు నన్ను ఆదరించారని ఆమె పేర్కొన్నారు.
1975లో తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తో పాటు కుటుంబ సభ్యుల హత్యల అనంతరం కొన్నేళ్లపాటు విదేశాల్లో గడిపిన ఆమె.. 1981లో బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. అలాగే, 2007లో దేశంలో రాజకీయ అత్యవసర పరిస్థితి నెలకొన్న సమయంలో తనపై క్రిమినల్ కేసులు నమోదైనప్పటికీ తిరిగి రావాలని నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘ముస్లిం నగరంగా పారిస్’


