పారిస్: ఆకాశాన్నంటిన నిత్యవసర వస్తువుల ధరలు, పెరిగిన ద్రవ్యోల్బణం, పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లోటుపై గత నెల సెప్టెంబర్ నుంచి ఫ్రాన్స్ పౌరులు తీవ్ర ఆందోళనలకు దిగారు. ఈ నిరసనలతో అక్కడి పరిస్థితులు రోజురోజుకూ దిగ జారిపోవడంతో దేశంలోని పలు ప్రాంతాలు యుద్ధ క్షేత్రాలను తలపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలకు పాఠశాలల సమస్యలు, లేదా ఇతర కారణాలు కాదని, కేవలం వలసలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
‘నేను ఇప్పటికే పలుమార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడాను. మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. వలసవాదులను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఫ్రాన్స్‌కే వస్తోంది’ అని హెచ్చరించినట్లు గుర్తుచేశారు.
యూరప్, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులు తక్షణమే తమ దేశాల సరిహద్దులను మూసివేయాలి. మితిమీరిన వలసదారుల వల్లే అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఐరోపా తన సరిహద్దులను మూసివేసి, నిరసన చేస్తున్న వారిలో నేరస్థులను గుర్తించకపోతే ఐరోపా నాశనమైపోతుందని పునరుద్ఘాటించారు.
కాగా, డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసలను అరికడతామని హామీ ఇచ్చారు. పలు సందర్భాలలో ట్రంప్ వ్యాఖ్యలు వలసదారుల్ని భయాందోళనకు గురి చేసేలా నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసిన సందర్భాలున్నాయి.
ఇదీ చదవండి : మద్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుగాలి


