‘అత్యాచారం, గర్భస్రావం ఇక్కడ నిత్యకృత్యం’ | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా డిటెన్షన్‌ సెంటర్లలో మహిళల పరిస్థితి

Published Tue, Jul 28 2020 8:24 PM

UN Report North Korean women faced Torture Malnourishment In Detention - Sakshi

ప్యోంగ్యాంగ్: నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలన గురించి ప్రపంచం అంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. కఠినమైన ఆంక్షల మధ్య జీవనం సాగిస్తున్న అక్కడి ప్రజల గురించి తల్చుకుంటే.. భయం వేస్తోంది. ఇక అక్కడి డిటెన్షన్‌ సెంటర్ల గురించి.. వాటిలో మగ్గుతున్న ఖైదీలు.. ప్రత్యేకించి మహిళల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిటీ ‘ఐ స్టిల్‌ ఫీల్‌ ది పెయిన్‌’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. డిటెన్షన్‌ కేంద్రాల్లో మహిళలు అనుభవించిన నరకం గురించి ఈ నివేదిక ప్రపంచానికి వెల్లడించింది. 2009 నుంచి 2019 వరకు దాదాపు 100 మంది మహిళలను ఈ డిటెన్షన్‌ కేంద్రాల్లో బంధించినట్లు నివేదిక తెలిపింది. వీరంతా ఉత్తర కొరియా నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ మహిళలు. విడుదలైన తర్వాత ఐక్యరాజ్యసమితి పరిశోధకులు వీరిని సియోల్‌లో అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేశారు. (నార్త్‌ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి!)

దీనిలో బాధితులు నిర్భంద కేంద్రాల్లో తాము స్వచ్ఛమైన గాలి, నిద్ర, పగటి పూట ఎండ, మంచి ఆహారానికి కూడా నోచుకోలేదని వెల్లడించారు. దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం నిద్రాహారాలు మాని పని చేస్తూనే ఉన్నామన్నారు. వీరంతా అధికారుల చేతుల్లో తీవ్ర హింసలకు గురి కావడమే కాక అత్యాచారానికి కూడా గురయ్యారని నివేదిక తెలిపింది. పోలీసు అధికారులు తమను అంగట్లో ఆటబొమ్మల మాదిరి చూసేవారని బాధితులు వెల్లడించారు. హింస, దురాక్రమణ, అత్యాచారం, బలవంతపు గర్భస్రావం వంటి దారుణాలు ఈ కేంద్రాల్లో నిత్యకృత్యమని బాధితులు వెల్లడించారు. ఓ మహిళ యూఎన్‌ అధికారులతో మాట్లాడుతూ.. ‘డిటెన్షన్‌ కేంద్రంలో ఓ అధికారి నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను తిరస్కరిస్తే.. నిన్ను హింసిస్తాను.. అవమానాలకు గురి చేస్తాను.. ఒప్పుకుంటే నిన్ను ఇక్కడ నుంచి త్వరగా విడుదల చేయడానికి సాయం చేస్తానని చెప్పాడు’ అని నివేదిక వెల్లడించింది.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు)

ఉత్తర కొరియా ఈ నివేదికపై వెంటనే స్పందిచలేదు.. కానీ గతంలో మాత్రం ఈ మానవహక్కుల నివేదిక తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన కుట్ర అని విమర్శించింది. ఈ నివేదికలో పాలు పంచుకున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అధికారి డేనియల్ కొల్లింగే మాట్లాడుతూ.. ‘పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్యోంగ్యాంగ్‌పై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాం. స్వేచ్ఛ, శ్రేయస్సు సాధించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన దేశం దాటుతున్న వారిని బహిష్కరించవద్దని ఇతర దేశాలను కోరుతున్నాను’ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement