అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి బిగ్‌ అలర్ట్‌! | Trump Rule Big Warning To Cine Political Cast Telugites | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి బిగ్‌ అలర్ట్‌!

Jan 21 2026 12:51 PM | Updated on Jan 21 2026 1:12 PM

Trump Rule Big Warning To Cine Political Cast Telugites

ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చేసిన మొదటి పని.. వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. ఇందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తరపున ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) అన్‌లిమిటెడ్‌ పవర్‌ కట్టబెట్టారు. అమెరికా భద్రత పేరిట లైంగిక దాడులు, గృహ హింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడినవారిని ఐస్‌ లోకల్‌ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేది. అయితే ఇప్పుడు ఆ దృష్టి పార్ట్‌టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులు.. ప్రొఫెషనల్‌ జాబులు చేసేవాళ్లపైకి మళ్లడం ఇండియన్‌ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది..

తాజాగా..  మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఐస్‌ (Immigration and Customs Enforcement) అధికారులు అరెస్టు చేశారు. అలాగే.. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాళ్లినట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ఈ రెండు కేసుల్లో తమ వద్ద అధికారిక ప్రతాలు చూపించినా.. తమకేం తెలియదని వాళ్లు ఎంత మొత్తుకున్నా అక్కడి అధికారులు వినలేదు. అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే డిటెన్షన్‌ సెంటర్‌లో గంటల తరబడి కూర్చోబెట్టి.. చివరాఖరికి పంపించేశారు.

అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారు. ముఖ్యంగా F1 స్టూడెంట్‌ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్‌ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం. అలా అక్రమంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఐస్‌ గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే..

ట్రంప్‌ పదవిలోకి వచ్చాక ఐస్‌ తన తనిఖీలను మరింత ఉధృతం చేసింది. గత ఏడాది వేలాది మందిని అరెస్ట్‌ చేసి డిపోర్ట్‌ చేసింది. అందులో అక్రమంగా చొరబడిన భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా వేదికలలోని చర్చలు భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలను ఇస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి భారతీయులే మీద ఐసీఈ ఫోకస్‌ పెట్టిందన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి.. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయవద్దని విద్యార్థులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

జాగ్రత్త.. తెలుగోడా!
పైన చెప్పిన రెండు అరెస్టులలో.. బాధితులు తెలుగువాళ్లే కావడం గమనార్హం!. వాళ్లను ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే.. ఏ రకంగా వాళ్ల దృష్టిలో పడ్డ తాట తీస్తారనే సంకేతాలు పంపించినట్లయ్యిందన్నమాట. ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్‌ లాయర్లు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది..

మా నాయకుడు గొప్పని.. మా కులం గొప్పని కొందరు దేశంకాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం, సోషల్‌ మీడియాలో పోస్టులు తరచూ చూస్తుండేదే. అలా అమెరికాలో ఉండి ఇక్కడి సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం, సో.మీ.లో పోస్టులు చేయడం ఏమాత్రం మంచిది కాదని న్యూమన్‌ గ్రూప్‌ లాయర్లు సూచిస్తున్నారు. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దంటున్నారు. ఇవి చట్ట విరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్‌ అయిన కూడా.. అక్కడి అధికారుల దృష్టిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే అరెస్టు, డిపోర్టేషన్‌ ప్రమాదం తప్పదని కుండబద్ధలు కొడుతున్నారు.

మనిషి చచ్చాక యమ భటులు వచ్చి లాక్కెళ్తారు కదా.. ఒకవేళ భారతీయులు గనుక అదుపులో ఉండకపోతే ఐస్‌(ICE) అధికారులు అంతకు మించి ట్రీట్‌మెంట్‌తో లాక్కెళ్లే ప్రమాదం ఉందనేది సోషల్‌ మీడియాలో ఓ​ యూజర్‌ చేసిన పోస్ట్‌ సారాంశం..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement