తొలి కరోనా కేసు నమోదు.. లాక్‌డౌన్‌ విధింపు

First Case Registered In North Korea - Sakshi

ప్యాంగ్యాంగ్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ ఆ ఒక్క దేశంలో మాత్రం కనీసం అడుగుపెట్టలేకపోయింది. ఆ దేశ నియంత పేరు చెబితే శత్రువులు వణికిపోవాల్సిందే అని  అనుకునేవారంతా.. ఇప్పడు కరోనా కూడా భయపడిందేమో అంటున్నారు. సరిహద్దు దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా ఇన్నాళ్లూ ఆ దేశంలో కనీసం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఇదంతా నిన్నటి (శనివారం) వరకు ఉన్న ముచ్చట. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఆదివారం రాత్రి  లక్షణాలున్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ దేశం అధికారికంగా ప్రకటించిన తొలి కేసు ఇదేకావడం గమనార్హం. (కరోనా కట్టడి: ‘ఇది కొరియా షైన్‌ సక్సెస్‌’)

మరోవైపు వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేసాంగ్ నగరంలో లాక్‌డౌన్ విధించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారితో మెలిగిన వారందరినీ కఠినమైన క్యారెంటైన్‌ నిబంధనలు వర్తించే విధంగా నిర్బంధించాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 976 పరీక్షలు నిర్వహించామని వారిలో ఏ ఒక్కరినీ కరోనా పాజిటివ్‌గా తేలలేదని అధికారులు అధ్యక్షుడికి వివరించారు. కోవిడ్ 19 లక్షణాలు ఉన్న 25,551 మందిని క్వారైంటైన్ చేశామని.. అందులో 255 మంచి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరించామని పేర్కొన్నారు. (దక్షిణ కొరియాకు కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధం)

తొలి కేసు నమోదైన దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కొరియాకు ప్రమాదం పొంచిఉందని కిమ్‌ ఆదేశించారు. కాగా కేసాంగ్‌ నగరం దక్షిణ కొరియాకు సరిహద్దుల్లో ఉంటుంది. మొన్నటి వరకు కాస్తా ప్రశాంతంగా ఉన్న సౌత్‌ కొరియాలో కరోనా తిరగబెడుతోంది. గడిచిన పది రోజుల్లో 50-60 కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయి. అక్కడి నుంచే వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందని నార్త్‌ కొరియా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆ దేశానికి సరిహద్దు గల చైనా లోనూ గతంలో వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్తు దృష్ట్యా చైనా సరిహద్దును ఇప్పట్లో తెరిచేది లేదని కిమ్‌ స్పష్టం చేశారు. కాగా గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి ఉత్తర కొరియా అన్ని సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్యాంగ్‌యాంగ్‌కు రాకపోకలపై నిషేధం విధించామని కిమ్‌ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి లేకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తిసుకుంటుదని హెచ్చరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top