చైనా సరిహద్దును తెరిచేది లేదు: కిమ్‌

Kim Jong Un Says North Korea Prevented Coronavirus From Making Inroads - Sakshi

ప్యాంగ్‌యాంగ్: కరోనా కట్టడికి విధించిన నిబంధలనలకు ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌‌ ఉన్‌ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా చైనా సరిహద్దును ఇప్పట్లో తెరిచేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి ఉత్తర కొరియా అన్ని సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా అధికార మీడియా వేదికగా కథనాలు ప్రచురించింది.

ఈ విషయాన్ని గురువారం నాటి సమావేశంలో మరోసారి పునరుద్ఘాటించిన కిమ్‌.. ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో మునిగిపోయిన వేళ తమ దేశం మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పరిస్థితి చేజారలేదని వ్యాఖ్యానించారు. అయితే పొరుగు దేశాల్లో ఇప్పటికీ మహమ్మారి విజృంభిస్తోందని.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇక ఉత్తర కొరియా అధికార వార్తా పత్రిక ఈ సమావేశానికి హాజరైన కిమ్‌, ఇతర అధికారుల ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది. అయితే ఇందులో కిమ్‌తో సహా ఎవరూ కూడా మాస్క్‌ ధరించకపోవడం గమనార్హం.

మీడియా సమావేశంలో కిమ్‌ మాట్లాడుతూ... ‘దేశంలో కరోనా కట‍్టడికి చేపట్టిన చర్యలు సత్పలితాలిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీనిని ‘షైన్‌ సక్సెస్‌’గా చెప్పాలి. అలా అని ఊపిరి పీల్చుకోవడానికి వీలులేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. మన పొరుగు దేశమైన చైనాలో మహమ్మారి తగ్గుముఖం పట్టి మళ్లీ వ్యాపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. (సోదరి ఆదేశాలు.. సైనిక చర్య వద్దన్న కిమ్‌!)

ఇప్పటికే ప్యాంగ్‌యాంగ్‌కు రాకపోకలపై నిషేధం విధించామని కిమ్‌ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి లేకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తిసుకుంటుదని హెచ్చరించారు. అయితే ప్యాంగ్‌యాంగ్లోని పలు రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు కిమ్‌ చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం చైనా సరిహద్దును తెరిచేందుకు వీలు లేదని, దీనివల్ల దేశం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్నందున సరిహద్దులను మూసివేయడం తప్ప ఉత్తర కొరియాకు వేరే మార్గం లేదని ఇన్ట్సీట్ట్యూట్‌ ఫర్ నేషనల్ యూనిఫికేషన్‌ ఉత్తర కొరియా డివిజన్ డైరెక్టర్ హాంగ్ మిన్ పేర్కొన్నారు. 

పతనమైన ఆర్థిక వ్యవస్థ
కరోనా నేపథ్యంలో కిమ్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోయిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర కొరియా మిత్ర దేశమైన చైనాకు చెందిన ఎకనమిక్‌ రీసెర్చ్‌ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు 90 శాతం మేర పడిపోయాయి. ఇదిలా ఉండగా.. కరోనా విజృంభిస్తున్న తొలినాళ్లలో చైనా సహా ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన అధికారులు, వ్యాపారులకు కఠిన నిబంధనలు విధించడమే గాకుండా.. కరోనా సోకిన వారిని ఉత్తర కొరియా దారుణంగా హతమార్చిందనే వార్తలు ప్రచారమైన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top