చివరి బంతి వరకూ పోరాడుతా..

No Confidence Motion On Imran Khan By Voting On April 3 - Sakshi

ఇస్లామాబాద్‌: పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని కచ్చితంగా ఎదుర్కొంటానని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌(69) సంకేతాలిచ్చారు. ఆయన గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ ఫలితంతో సంబంధం లేకుండా బలీయమైన శక్తిగా తిరిగి వస్తానని చెప్పారు. రాజీనామా చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారని, అసలు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు.

తాను క్రీడాకారుడినని, 20 ఏళ్లపాటు క్రికెట్‌ ఆడానని, చివరి బంతి వరకూ పోరాడుతూనే ఉంటానని అందరికీ తెలుసని చెప్పారు. జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు. తమ విధానాలు అమెరికాకు, యూరప్‌కు, భారత్‌కు వ్యతిరేకం కాదని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని విమర్శించారు. భారత్‌–పాక్‌ మధ్య ఉన్న అతిపెద్ద వివాదం కశ్మీర్‌ అంశమేనని తెలిపారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాతే భారత్‌కు పాక్‌ వ్యతిరేకంగా మారిందన్నారు.

అవినీతిపరులు కావాలా?
పాకిస్తాన్‌పై విదేశీ శక్తుల పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదని ఇమ్రాన్‌ స్పష్టం చేశారు. కొందరు పాక్‌ ప్రతిపక్ష నేతలు విదేశీ శక్తులతో అంటకాగుతున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, అధికారం కోసం దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ అధ్యక్షుడు షెహజాద్‌ షరీఫ్, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ కో–చైర్మన్‌ అసిఫ్‌ అలీ జర్దారీ, జామియత్‌ ఉలెమా–ఇ–ఇస్లామా నేత మౌలానా ఫజలుర్‌ రెహ్మాన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. కుట్రదారుల ఆటలు సాగవని హెచ్చరించారు. పాకిస్తాన్‌ ప్రయాణం ఎటువైపు అన్నది అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ తర్వాత తేలిపోతుందని వ్యాఖ్యానించారు.

నోరుజారిన ఇమ్రాన్‌
తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలో భాగంగా అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు లేఖ పంపిందని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కేవలం విదేశాల కుట్ర అని ఆరోపిస్తున్న ఆయన పొరపాటున అమెరికా పేరును బయటపెట్టారు. ఆ లేఖ కేవలం తనకు వ్యతిరేకంగా ఉందని, తన ప్రభుత్వానికి కాదని చెప్పారు.

అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని
342 మంది సభ్యులున్న పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్‌)లో అవిశ్వాస తీర్మాన పరీక్షలో ఇమ్రాన్‌ ఖాన్‌ నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, తమకు 175 మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. పాకిస్తాన్‌ చరిత్రలో ఇప్పటిదాకా ఇద్దరు ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఎవరూ ఈ తీర్మానంలో ఓడిపోలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ ఖాన్‌ రికార్డుకెక్కారు.

పాక్‌ పార్లమెంట్‌ 3కు వాయిదా
పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌) సెషన్‌ అనూహ్యంగా ఆదివారానికి వాయిదా పడింది. గురువారం దిగువ సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ‘గో ఇమ్రాన్‌ గో’ అంటూ నినాదాలు చేశారు. శాంతించాలంటూ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం సూరి చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను ఆదివారం ఉదయం 11.30 వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్‌ జరుగనుంది.

పాక్‌కు ఎలాంటి లేఖ పంపలేదు: అమెరికా
తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వెనుక అమెరికాతో సహా ఇతర దేశాల కుట్ర ఉందంటూ పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఆరోపణలను అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు. ఇమ్రాన్‌ చెబుతున్నట్లుగా పాకిస్తాన్‌కు తమ ప్రభుత్వ సంస్థలు గానీ, అధికారులు గానీ ఎలాంటి లేఖ పంపలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో తాజా పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అమెరికా ప్రభుత్వాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. ఇమ్రాన్‌ ఖాన్‌ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు.

జాతీయ అసెంబ్లీ రద్దుకు తెరవెనుక ముమ్మర యత్నాలు
342 సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తన పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలతో రాజీకోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ రద్దు కోసం ప్రతిపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై అధికార తెహ్రిక్‌–ఇ–ఇన్సాఫ్‌ ప్రభుత్వం, ప్రతిపక్షాల నడుమ చర్చలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి.

అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఉపసంహరించుకోవడం, అందుకు ప్రతిఫలంగా పార్లమెంట్‌ను రద్దు చేసి, మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లడం.. ఇదే ఈ చర్చ ఏకైక ఎజెండా అని వెల్లడించాయి. అయితే, ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రతిపాదన పట్ల ప్రతిపక్షాలు అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇమ్రాన్‌ ప్రభుత్వం కూలిపోయి, ఎన్నికలు రావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌కు ‘సేఫ్‌ ప్యాకేజీ’ ఇవ్వొద్దని ప్రతిపక్ష పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) చైర్మన్‌ బిలావల్‌ భుట్టో గురువారం అన్నారు. పార్లమెంట్‌లో మెజారిటీని కోల్పోయిన ఇమ్రాన్‌ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top