
31వసారి అధిరోహించిన షెర్పా
కఠ్మాండు: ఎవరెస్ట్ మాన్‌గా పేరు తెచ్చుకున్న నేపాలీ పర్వతారోహకుడు 55 ఏళ్ల కామి రీటా కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఆ శిఖరాన్ని 31వసారి అధిరోహించాడు. ఎవరెస్టును అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తిగా సొంత రికార్డునే బద్దలు కొట్టారు. భారత సైనికాధికారుల బృందానికి మార్గనిర్దేశం చేస్తూ మంగళవారం తెల్లవారుజా మున 4 గంటలకు కామి ఎవరెస్టును అధిరోహించాడు. కామి నేపాల్‌లోని సోలుకుంబ్ సమీపంలోని థామే గ్రామంలో జన్మించాడు. తన జీవితాన్ని పర్వతారోహణకే అంకితం చేశాడు. 1994లో ఒక వాణిజ్య యాత్రకు మార్గదర్శకునిగా తొలిసారి ఎవరెస్టును అధిరోహించారు.
అప్పటి నుంచి దాదాపు ఏటా ఆ ఘనత సాధిస్తూ వచ్చారు. 2023, 2024ల్లోనైతే రెండేసిసార్లు ఎక్కారు. మరో నేపాలీ షెర్పా పసంగ్ దావా 29సార్లు ఎవరెస్టును ఎక్కారు. ‘‘నారికార్డులతో సంతోషంగా ఉన్నా. కానీ రికార్డులు చివరికి బద్దలవుతాయి. నా రికార్డులు ప్రపంచ వేదికపై నేపాల్ గుర్తింపుకు దోహదపడటం సంతోషంగా ఉంది’’ అని కామి అన్నాడు. బ్రిటిష్ పర్వతారోహకు డు కెంటన్ కూల్ ఇటీవలే 19వసారి ఎవరెస్టు ఎక్కారు.
దాన్ని అత్యధికసార్లు అధిరోహించిన షెర్పాయేతర వ్యక్తిగా స్వీయ రికార్డునే బద్దలు కొట్టారు. ఎవరెస్టు ఎక్కే సీజన్ త్వరలో ముగియనుంది. ఈ ఏడాది 500 మందికి పైగా ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఎవరెస్ట్ తో సహా పలు ఇతర శిఖరాలను ఎక్కడానికి నేపాల్ ఈ సీజన్‌లో 1,000కి పైగా పర్మిట్లు జారీ చేసింది. ఇటీవల ఎవరెస్ట్ ఎక్కేవారి సంఖ్య పెరగడం పర్యావరణ ఆందోళనలకు దారితీసింది.