Nepal Plane Crash: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన

Nepal Plane Crash: Flight Attendant Father Said Skip That Day - Sakshi

నేపాల్‌ విమానా ఘటన తర్వాత పలువురు గురించి వస్తున్న ఆసక్తికర విషయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఆ ఘటన బాధిత కుటుంబాలకు అంత తేలిగ్గా మర్చిపోలేని అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆ దుర్ఘటన రోజు విధులు నిర్వర్తించేందకు వెళ్లిన ఫ్లైట్‌ అటెండెంట్‌ ఓషిన్‌ అలే మగర్‌ది మరో విషాద గాథ.  ఆ ఫ్లైట్‌ అటెండెంట్‌ అలే మగర్‌ రెండేళ్లుగా యతి ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. ఆమె ఖట్మాండ్‌లో తన కుటుంబంతో నివశిస్తోంది.

వాస్తవానికి ఆరోజు విధులు నిర్వర్తించాల్సింది కాదు. ఇంట్లో తండ్రి మోహన్‌ అలే మగర​ ఆమెను ఆరోజు డ్యూటీ మానేయమని, సంక్రాంతి పండుగ చేసుకుందామని చెప్పారు. అయినా సరే ఆమె పట్టుపట్టి మరీ ఆ రోజు విధులకు వెళ్లింది. పైగా తాను రెండు విమానాల్లో చేయాల్సిన డ్యూటీని ముగించుకుని సంక్రాంతి రోజుకల్లా వచ్చేస్తానంటూ వెళ్లిందన ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కచ్చితంగా సంక్రాంతి రోజున ఇంట్లోనే ఉంటానని హామీ ఇచ్చిందంటూ విలపించారు. అంతలోనే ఈ ప్రమాదం బారిన పడి కానరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదనగా చెప్పారు. ఆమెకు పెళ్లై రెండేళ్లే అయ్యిందని, ఆమె భర్త యూకేలో ఉన్నట్లు తెలిపారు.

ఐతే ఇప్పుడూ ఆ ఫ్టైల్‌ అటెండెంట్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో..నెటిజన్లు ఆ యతి ఎయిర్‌లైన్స్‌ విమానం కూలిపోడానికి కొన్ని క్షణాల ముందు రికార్డు చేసిన వీడియో అని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇది గతేడాది సెప్టెంబర్‌ 11న రికార్డు చేసిన వీడియో అని, విమానం క్రాష్‌ జరగడానికి ముందు తీసినది కాదని ఆమె టిక్‌టాక్‌లో షేర్‌ చేసిన వీడియో ఆధారంగా తెలుస్తోంది. కాగా, నేపాల్‌లో ఆదివారం యతి ఎయిర్‌లైన్‌ ఏటీఆర్‌ 72 విమానం కూలి సుమారు 68 మంది దాక మృతి చెందిన సంగతి తెలిసిందే.

(చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top