ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు

Nepal Plane Crash: Witness Shares Details Darkness All Around - Sakshi

నేపాల్‌ విమానం కూలిన విషాద ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాకి వివరించారు. ఈ మేరకు ఒక స్థానిక నివాసి కల్పనా సునార్‌ ఆ విమానం బాంబు లాంటి పేలుడుతో తమ వైపుకు దూసుకురావడాన్ని చూసినట్లు పేర్కొంది. ఆ సమయంలో తాను బట్టలు ఉతుకుతున్నానని చెప్పింది. ఆ విమానం పాత విమానాశ్రయానికి, కొత్త విమానాశ్రయానికి మధ్య ఉన్న సేతి నది వద్ద కుప్పకూలిందని, ఆ నది లోయ చుట్టు నల్లటి దట్టమైన పొగ కమ్మేయడం చూశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో విమానం అసాధారణ రీతిలో వంగి ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. 

మరో ప్రత్యక్ష సాక్షి గీతా సునార్‌ తమ ఇంటికి 12 మీటర్ల దూరంలో విమానం రెక్క పడిందని తెలిపారు. అది మా నివాసాలకు కాస్త దూరంలో పడిందని లేదంటే మా నివాసాలు దగ్ధమయ్యేవని, చాలా నష్టం వాటిల్లేదని చెప్పింది. సేతి నదికి రెండువైపులా మంటలు చెలరేగాయని, మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయని చెప్పింది. అలాగే 11 ఏళ్ల పిల్లలు సమీర్‌, ప్రజ్వల్‌ తాము ఆసమయంలో ఆడుకుంటుండగా ఏదో బొమ్మ విమానం పడుతున్నట్లుగా కనిపించిందని, ప్రయాణికులు అరుపులు కూడా వినిపించాయని చెప్పారు.

కాసేపటికి మా వైపుకి దూసుకురావడంతో భయంతో పారిపోయామని చెప్పారు. ఏదో టైర్‌ క్రాష్‌ అయినంత సౌండ్‌ వినిపించిందని అది మమ్మల్ని తాకినట్లు అనిపించిందని చెప్పుకొచ్చారు. క్రాష్‌​ అయిన కాసేపటికి దగ్గరకు వెళ్దామంటే దట్టమైన పొగ వ్యాపించి ఏమి కనిపించలేదని స్థానికుల చెప్పారు. అయితే విమానంలోని సుమారు ఏడు నుంచి ఎనిమిది విండోలు చెక్కు చెదరకుండా ఉంటే ఎవరైనా సజీవంగా బతికి ఉంటారని భావించామని అన్నారు.

మరికొంతమంది ఈ ఘటన జరగుతుండగా భయాందోళనతో ఉన్నామని, తాము చూస్తుండగానే విమానం మిగతా సగం వైపుకి కూడా మంటలు వ్యాపించాయని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనలో సుమారు 68 మంది ప్రయాణికులు చనిపోగా..ఇంకా నలుగురు మృతదేహాల ఆచూకి లభించలేదు. సోమవారం కూడా వారి కోసం నేపాల్‌ భద్రతా సిబ్బంది గాలించడం పునః ప్రారంభించారు. అలాగే ప్రమాద స్థలం నుంచి బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

(చదవండి: నేపాల్‌ విమాన ఘటన: కోపైలట్‌ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top