భార్యకు తెలీకుండా ప్రియురాలితో మాల్దీవ్‌ ట్రిప్‌.. ‘ఆమె’ ఫోన్‌ చేయడంతో

Mumbai Man Ploy To Hide Maldives Trip With Lover From Wife Landed Him In Jail - Sakshi

మాల్దీవులు.. ఏంటో ఈ మధ్య ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. ఏ జంటను చూసిన ఎంచక్కా మాల్దీవులకు చెక్కేస్తున్నారు. హాలీడే వెకేషన్‌ స్పాట్‌గా ఈ పేరు తెగ మార్మోగుతోంది. కరోనాతో రెండేళ్లపాటు ఇళ్లలోనే  ఉండి విసుగెత్తిన ప్రజలు  హాయిగా సేదతీరేందుకు మాల్దీవుల బాట పడుతున్నారు. పాపం ఇలాగే ఆలోచించి.. పెళ్లైన ఓ వ్యక్తి కూడా ఎంజాయ్‌మెంట్‌ కోసం మాల్దీవులకు వెళ్లాడు.

వెళ్తే వెళ్లనీ అందులో పెద్ద విషయం ఏముంది అనుకుంటాన్నారా.. అయితే అతను వెళ్లింది తన భార్యతో కాదండీ.. వివాహేతర సంబంధాన్ని  కొనసాగిస్తున్న ప్రియురాలితో. అంతేగాక తొందరపాటులో చేసిన పొరపాటు అతన్ని జైలుపాలు చేసింది. ముంబైకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఎంఎన్‌సీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.  ఇటీవల ఆయన భార్య ఆఫీస్‌ పని మీద విదేశాలకు వెళ్లింది. దీంతో ఇదే సువర్ణావకాశంగా భావించిన వ్యక్తి తనప్రియురాలితో మాల్దివులకు వెళ్లి రిలాక్స్‌ అవుదామనుకున్నాడు.

అనుకున్నట్లు భార్య అలా ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిందో లేదో ఇటు ఇతను తన ప్రేయసితో హాలీడ్‌ ట్రిప్‌కు చెక్కేశాడు. అక్కడా ఇద్దరు జాలీగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే భర్త తన కాల్‌ ఎంతకీ లిఫ్ట్‌ చేయకపోవడంతో అతనిపై భార్య అనుమానం పెంచుకుంది. భర్తకు పలుమార్లు వాట్సాప్‌ ‌ కాల్‌ చేసింది. భార్య ఫోన్‌ చేస్తుండటంతో ఖంగుతున్న భర్త తన వెకేషన్‌కు స్వస్తీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే మాల్దీవులకు వెళ్లిన విషయం భార్యకు తెలిస్తే చంపేస్తుందని భయపడి ఓ తింగరిపని చేశాడు.
చదవండి: పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. రెండడుగులు కలిసి నడిచి..

పాస్‌పోర్టులోని కొన్ని పేజీలను చింపేసి అక్కడి నుంచి ఇండియాకు పయనమయ్యాడు. అయితే గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగా ఇమిగ్రేషన్‌ అధికారులు అతని పాస్‌పోర్టును తనిఖీ చేశారు. అందులో 3-6, 31-34 పేజీలు కనిపించకపోవడాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు గమనించారు. దాని గురించి ప్రశ్నించగా ఏవోవే సమాధానాలు చెప్పడంతో చీటింగ్‌, ఫోర్జరీ ఆరోపణలపై అతన్ని అధికారులు అరెస్ట్‌ చేసి పోలీసులకు అప్పగించారు. 

పోలీసుల విచారణలో  తన ప్రియురాలో కలిసి మాల్దీవులకు వెళ్లినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని తన భార్యకు తెలియకుండా రహస్యంగా ఉంచేందుకు పాస్‌పోర్ట్ పేజీలను చింపివేశానని కూడా తెలిపాడు. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను ఏ విధంగానూ పాడు చేయడం నేరపూరిత చర్య అని పోలీసులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top