
ఖట్మాండు: ఎవరెస్ట్ పర్వతంపై భారీ మంచు తుఫాన్ పర్వతంతో(Mount Everest blizzard) ఒక్కసారిగా అలజడి రేగింది. సుమారు 1,000 మంది పర్వతారోహకులు ఈ తుపానులో చిక్కుకునిపోగా.. వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టిబెట్ వైపు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో చైనా ప్రభుత్వం ఈ సహయక చరయలను పర్యవేక్షిస్తోంది.
మౌంట్ ఎవరెస్ట్‌పై టిబెట్(Mount Everest Tibet) వైపు అక్టోబర్ 3న తేదీన భారీ మంచు తుఫాన్ ప్రారంభమైంది. ఈ ప్రభావంతో కర్మా వ్యాలీ, కాంగ్షుంగ్ వైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లు క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకునిపోయారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో మంచు తొలగిస్తూ దారులను క్లియర్ చేస్తున్నారు.
Nearly 1,000 people are trapped on Mount Everest slopes — Rescue operation underway.#MountEverest #Everest pic.twitter.com/hyVSR0ER3a
— Shehzad Qureshi (@ShehxadGulHasen) October 5, 2025
రెస్యూ బృందాలు ఇప్పటిదాకా 350 మందిని కాపాడినట్లు సమాచారం. వాళ్లందరినీ ఆదివారం నాటికే క్యూదాంగ్ పట్టణానికి తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
హైపోథర్మియా(Hypothermia.. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువకి పడిపోవడం) కారణంగా పర్వతారోహకులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు స్పష్టమవుతోంది. “ఇది తమ జీవితంలోనే అత్యంత భయంకరమైన రాత్రి” అని పలువురు మీడియాకు రోదిస్తూ చెప్పారు. మంచు తుఫాన్ ధాటికి టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో పర్వతారోహకులు సురక్షిత ప్రాంతాల వైపు తరలిపోతున్న దృశ్యాలతో ఓ వీడియో రికార్డు బయటకు వచ్చింది.
అయితే పర్వతారోహకులు అలా తరలిపోతుండడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి తప్పిపోయే అవకాశం ఉండడం, పైగా హైపోథర్మియాతో పాటు ఆక్సిజన్ కొరత వాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
తుఫాన్ తీవ్రంగానే..
కర్మా లోయ సముద్ర మట్టానికి 4,200 మీటర్ల ఎత్తులో ఉంది. నేపాల్‌లో భారీ వర్షాలు, మెరుపు వరదలు,కొండ చరియలు విరిగిపడి 47 మంది మరణించారు. ఈ ప్రతికూల వాతావరణ ప్రభావంతో.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఎవరెస్ట్‌పై మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షం, ఆపై భారీ మంచు తుపాను సంభవించింది. మరోవైపు.. తుపాను నేపథ్యంలో తింగ్రీ కౌంటీ టూరిజం సంస్థ అన్ని టికెట్ అమ్మకాలు, ప్రవేశాలను శనివారం నుంచే నిలిపివేసింది.
గతంలోనూ..
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. అయితే దీనిని అధిరోహించే క్రమంలో అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 340 మరణించారు. అలాగే గతంలో ప్రకృతి విపత్తుల కారణంగానూ ఇక్కడ ప్రాణ నష్టం సంభవించింది కూడా. 1996 మే 10-11 తేదీల్లో మౌంట్ ఎవరెస్ట్ తుపాను కారణంగా ఎనిమిది మంది మరణించారు. అలాగే.. 2014 ఏప్రిల్ 18వ తేదీన మంచు శిఖరాలు (ice seracs) కూలిపోవడంతో 16 మంది నేపాలీ గైడ్లు మృతి చెందారు. అయితే భద్రతా లోపాలు, పైగా ఈ ఘటనలో భాదిత కుటుంబాలకు తక్కువ పరిహారం చెల్లించడంతో గైడ్లు సమ్మెకు దిగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2015 నేపాల్ భూకంపం కారణంగా.. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌పై మంచు కుప్పలు కూలి 22 మంది మృతి చెందారు. చరిత్రలో అత్యంత ఘోరమైన ఎవరెస్ట్ విపత్తుగా దీనికి గుర్తింపు లభించింది.