ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు | US Airstrikes On Iran Escalate Tensions In West Asia, Raising Fears Of Wider Conflict, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు

Jun 11 2026 6:40 AM | Updated on Jun 11 2026 11:55 AM

Middle East Crisis: US Severe Attacks On Iran News

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్‌పై అమెరికా భీకర దాడులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ నామమాత్రంగానే మిగిలి.. పరిస్థితి మళ్లీ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. ఇక హర్ముజ్‌ జలసంధి నుంచి గల్ఫ్‌ దేశాల వరకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ప్రపంచం ఉత్కంఠగా పరిణామాలను గమనిస్తోంది.

అమెరికా బలగాలు తాజాగా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై వరుసగా రెండో రోజు భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా చేసుకున్నాయి. ఈ దాడుల్ని అమెరికా స్వీయ రక్షణ దాడులుగా అభివర్ణించడం గమనార్హం. 

తాజా దాడుల్లో హర్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌లోని సిరిక్‌, మినాబ్‌, ఖేష్మ్‌ (Qeshm) దీవి, జాస్క్‌ పోర్టు పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో కూడా వైమానిక హెచ్చరిక వ్యవస్థలు చురుగ్గా పనిచేసినట్లు ఇరానియన్‌ మీడియా వెల్లడించింది. పలు రాడార్‌ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం.

అంతేకాకుండా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే అసలుయె ప్రాంతంలోని ప్రముఖ పెట్రోకెమికల్‌ ప్లాంట్‌పై కూడా అమెరికా దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంధన, పెట్రోకెమికల్‌ రంగాలపై ఆధారపడిన ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్‌ పశ్చిమ ప్రాంతాల్లో ఎయిర్‌ సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో పహారా పెంచాయి. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు.

సంచలన వ్యాఖ్యలు
అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. "ఇరాన్‌ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడాల్సి వస్తుంది" అంటూ ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా దాడులు ఇరాన్‌ సామర్థ్యాలను దెబ్బతీసేలా, తమ సైనిక కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు సృష్టించేలా కొనసాగుతాయని హెగ్‌సెత్‌ స్పష్టం చేశారు. 

ఇరాన్‌ స్పందన
అమెరికా చర్యలపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తప్పుడు నెపాలతో దాడులకు పాల్పడుతోందని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియన్‌ ఆరోపించారు. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (IRGC) కూడా ఈ దాడులను ఖండిస్తూ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది.  ఇదిలా ఉండగా, అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్‌, జోర్డాన్‌, కువైట్‌ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. అయితే ఆ దేశాలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలతో గల్ఫ్‌ ప్రాంతమంతా హైఅలర్ట్‌లోకి వెళ్లింది. 

తాజా పరిణామాలు చూస్తే అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కేవలం పరిమిత ప్రతీకార దాడుల దశ దాటి.. మరింత విస్తృత ఘర్షణ వైపు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్‌ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్‌ దేశాల స్థిరత్వంపై ఈ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement