ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పర్షియన్ గల్ఫ్ వేదికగా మరోసారి ఇరు దేశాలకు దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పేరిట పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
హర్ముజ్‌లో యూఎస్ యుద్ధనౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్, మాసన్ లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని.. జరిగింది చిన్నస్థాయి దాడులని ఆయన అన్నారు.
అయితే ఆ వెంటనే. ఇరాన్‌లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడికి దిగింది. మరోవైపు.. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. క్విష్మ్, బందర్ అబ్బాస్ నగరాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై క్షిపణులు విరుచుకుపడడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి!. ఈ దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఅమెరికా తుంగలో తొక్కిందని విమర్శిస్తూనే.. ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం కలిగే అకాశం కనిపిస్తోంది.
ఇరాన్‌కు సాలిడ్ వార్నింగ్!
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందానికి రావాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ సాధారణ దేశం కాదు.. అది ఉన్మాదుల చేతుల్లో ఉంది. గాలిలోనే వాళ్ల డ్రోన్లు దగ్గం అయ్యాయి. సీతాకోకచిలుకల్లా సముద్రంలో రాలిపోయాయి. శాంతి ఒప్పందంపై త్వరగా సంతకం చేయాలి. లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది’’ అని అన్నారు.
ట్రంప్ తీరు బాగోలేదు!
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాక్‌తో కలిసి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధిలో నౌకల కోసం చేపట్టిన ఎస్కార్ట్ ఆపరేషన్‌ను ట్రంప్ 24 గంటలు గడవక ముందే ఆపేశారు. ఆయన ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడంపై సౌదీ అరేబియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు గగనతల అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.


