మనువుతో మతిమరుపే! | Marriage linked to higher dementia risk in older adults | Sakshi
Sakshi News home page

మనువుతో మతిమరుపే!

Apr 14 2025 5:41 AM | Updated on Apr 14 2025 5:41 AM

Marriage linked to higher dementia risk in older adults

ఒంటరివాళ్లకు ఆ ముప్పు తక్కువ 

తాజా అధ్యయనంలో వెల్లడి

ఒంటరితనంతో బాధపడేవారు కొన్ని విషయాలనే పదేపదే ఆలోచిస్తూ మిగతా వాటిని మర్చిపోతారనే వాదన ఉంది. కానీ అందులో అస్సలు నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి బల్లగుద్ది చెబుతోంది. సోలో బతుకే సో బెటరు అంటోంది. పెళ్లికాని ప్రసాదుల్లో మతిమరుపు లక్షణాలు తక్కువని చెబుతోంది. వైవాహిక బంధానికి బీటలు పడి మళ్లీ ఒంటరయ్యే వాళ్లలో కూడా మతిమరుపు బారిన పడే అవకాశాలు బాగా తగ్గుతున్నట్టు కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది.

వేల మందిపై అధ్యయనం తర్వాత.. 
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర విశ్వవిద్యాలయం ఈ పరిశోధన జరిపింది. ఇందుకోసం అమెరికాలో 24,000 మందిని ఎంపికచేశారు. వాళ్లందరినీ 18 ఏళ్లపాటు అధ్యయనం చేశారు. పెళ్లయిన వాళ్లు, విడాకులైన వాళ్లు, బ్రహ్మచారులు, జీవితభాగస్వామి అనారోగ్యంతో కన్నుమూసిన వారిని పరిశోధనకు ఎంచుకున్నారు. మతిమరుపు లక్షణాలు లేని వాళ్లను మాత్రమే అధ్యయనం కోసం ఎంపికచేశారు. పెళ్లికాని వాళ్లను మూడు గ్రూప్‌లుగా విభజించి ఆరోగ్య పరిస్థితిని అంచనావేశారు. 

పెళ్లయిన వాళ్లతో పోలిస్తే వారికి మతిమరుపు ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పొగ తాగడం, కుంగుబాటు వంటివి ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెప్పారు. పెళ్లయిన వాళ్లతో పోలి స్తే పెళ్లయి విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో మతిభ్రంశం ముప్పు తక్కువగా ఉందని బయటపడింది. పెళ్లికాని వ్యక్తుల్లో అల్జీమర్స్‌ తరహా డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంది. అయితే డిమెన్షియాలో అరుదైన రకమైన వాసు్కలర్‌ చిత్తవైకల్యం ముప్పు వివరాలు వెల్లడికాలేదు.

విడాకులు తీసుకున్న వాళ్లలో 
విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో అభిజ్ఞానవికాసం క్షీణించి డిమెన్షియా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. అధ్యయనకాలంలో జీవితభాగస్వామి చనిపోవడంతో ఒంటరిగా మారిన వ్యక్తుల్లోనూ మనోభ్రంశం ముప్పు తక్కువగా ఉండటం విశేషం.  

మెదడు ఆరోగ్యం ముఖ్యం 
మెదడు పనితీరు ఎంత కీలకమైందో ఈ పరిశోధనలో మరోసారి స్పష్టమైంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణా మాలు, కష్టాలు, రాజీపడటం, కీలకమైన నిర్ణయాలు అనేవి మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పెళ్లిచేసుకుంటే హాయిగా ఉంటాం అనేది నిజం కాదని, పెళ్లాయ్యాక కూడా హాయిగా ఉండగల్గితేనే మెదడు ఆరోగ్యం బాగుంటుందని పరిశోధన పునరుద్ఘాటించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన వాళ్లు, విడాకులు తీసుకున్న వాళ్లు ఎంతో వేదనకు గురవుతారన్న అభిప్రాయాన్ని సవాల్‌ చేసేలా ఈ పరిశోధనా ఫలితాలు రావడం గమనార్హం. 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement
 
Advertisement
Advertisement