అమెరికా వెళ్లాలనుకోవటం చాలా మంది భారతీయుల కల. అక్కడికి వెళ్లి విలాసవంతమైన జీవితం గడపవచ్చు, ఆర్దికంగా ఎదగవచ్చని భావిస్తుంటారు. అయితే అగ్రరాజ్యంలో వైద్యం మాత్రం సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. అమెరికాలో అనారోగ్యం పాలైతే మాత్రం జేబులకు చిల్లులు పడడం ఖాయం.
ఇలాంటి అనుభవమే అరిజోనాలో నివసిస్తున్న ఓ భారతీయుడికి ఎదురైంది. జైపూర్‌కు చెందిన పార్త్ విజయ్‌వర్గియా ఉద్యోగ రీత్యా అరిజోనాలో ఉంటున్నారు. అయితే పార్త్ ఇటీవల ఐస్ స్కేటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ, అంబులెన్స్ ఖర్చులకు భయపడి తన కారులోనే హాస్పిటల్‌కు వెళ్లాడు.
అతడు అస్పత్రిలో కేవలం 90 నిమిషాలు మాత్రమే గడిపాడు. అతడికి ప్రాథమిక చికిత్స అందించి పంపించారు. అయితే ఆ తర్వాత అతడు తనకు వచ్చిన బిల్ చూసి షాకయ్యాడు. విజయ్‌వర్గియాకు ఏకంగా బిల్లు 4,000 డాలర్లు (సుమారు రూ.3.36 లక్షలు) బిల్లు వచ్చింది. పార్త్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది.
అయినప్పటికీ, అతడు తన జేబు నుండి 1,800 డాలర్లు (దాదాపు రూ.1.5 లక్షలు) చెల్లించాల్సి వచ్చింది. మీ వెనుక ఆర్ధికంగా సపోర్ట్ ఉంటేనే అమెరికాకు రావాలని పార్త్ విజయ్‌వర్గియా సూచించాడు. కేవలం జీతం మీద మాత్రమే ఆధారపడితే ఇటువంటి సమస్యలు ఎదుర్కొక తప్పదని అతడు హెచ్చరించాడు.


