
బంగ్లాలో మళ్లీ ముసలం
ప్రజా మద్దతుతో కఠిన చర్యలు
ఆర్మీ చీఫ్, బీఎన్‌పీకి ప్రభుత్వ హెచ్చరికలు
ఢాకా: కొద్ది నెలలుగా అస్థిరతకు మారుపేరుగా మారిన బంగ్లాదేశ్‌లో మళ్లీ ముసలం పుట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ)తో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్, బీఎన్‌పీ చేస్తున్న ఒత్తిడిపై యూనుస్ వర్గం మండిపడుతోంది.
బ్లాక్‌మెయిలింగ్ చర్యలను తక్షణం కట్టిపెట్టకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ శనివారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పరాజిత శక్తులు, విదేశీ కుట్రలు ప్రభుత్వ పనితీరుకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపణలకు దిగింది. సర్కారును కాపాడుకునేందుకు అవసరమైతే వీధి పోరాటాలకు కూడా యూనుస్ వర్గం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు.
ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనుస్ ఆదివారం పలు పారీ్టలతో భేటీ కానున్నారు. 2026 జూన్‌కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనుస్ సర్కారు చెబుతుండగా వచ్చే డిసెంబర్‌లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి. బీఎన్‌పీ ప్రేరేపిత ఆందోళనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా గత ఆగస్టులో దేశం వీడి భారత్‌లో ఆశ్రయం పొందడం తెలిసిందే. ఆర్మీ ఒత్తిళ్ల నేపథ్యంలో యూనుస్ తప్పుకుంటున్నట్టు తాజాగా వార్తలు రావడం, ఆయన వర్గం వాటిని ఖండించడం తెలిసిందే.