Love Your Eyes: ఆ కళ్లను ప్రేమిస్తున్నారా? అయితే ముందు మీ కళ్లను ప్రేమించండి!

Love Your Eyes World Sight Day 2021Theme History and Significance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మనిషికి ప్రకృతి అందించిన అత్యంత అందమైన బహుమతి, గొప్ప వరం కళ్ళు.  అందుకే సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. ఒక్కపది నిమిషాలు కళ్లుమూసుకుని లోకానికి చూడడానికి ప్రయత్నిస్తే వీటి విలువ మనకు అర్థమవుతుంది. దృష్టి లోపం, అంధత్వం, దృష్టి సంబంధిత సమస్యల గురించి అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం వరల్డ్  సైట్‌ డే ను జరుపుకుంటారు. ఈ క్రమంలో లవ్ యువర్ ఐస్  అనే నినాదంతో  ఈ ఏడాది  అక్టోబర్ 14న  ఈ డే  జరుపుకోవాలని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్  ప్రకటించింది.

2000 సంవత్సరంలో, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ చెందిన సైట్‌ ఫస్ట్ క్యాంపెయిన్ ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ విజన్ గ్లోబల్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రచారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ  పాల్గొని, తమ కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పిలుపునిస్తోంది.

2030 నాటికి సభ్య దేశాలు రెండు కొత్త ప్రపంచ లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. రిఫ్రాక్టెవ్‌ ఎర్రర్స్‌ నివారణలో 40 శాతం వృద్ధిని, కంటిశుక్లం శస్త్రచికిత్సల కవరేజీలో 30శాతం పెరుగుదల సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా భవిష్యత్తులో కంటి సంరక్షణలోనూ  నాణ్యమైన సేవలను అందించడంలో కూడా కీలక పాత్ర పోషించాలని భావించాయి. కొందరికి పుట్టుకతోనే దృష్టి లోపాలొస్తే మరి కొందరికి వయసు రీత్యా ఏర్పడతాయి.  ఈ రెండింటితోపాటు  ప్రస్తుత జీవన పరిస్థితుల్లో మానవ నిర్లక్ష్యం కూడా కారణమని నిపుణులు చెబుతున్న మాట. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది నివారించగల దృష్టి లోపంతో బాధపడుతున్నారు. అంతేకాదు ప్రపంచంలో  80 శాతం మందిని అంధత్వంనుంచి నివారించే అవకాశం ఉంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక బిలియన్ ప్రజలు దగ్గరి లేదా దూరపు చూపు మందగింపు  (మయోపియా లేదా హైపర్‌ మెట్రోపియా) సమస్యతో బాధపడుతున్నారు. ఇది నివారించగలిగే సమస్య. పిల్లలు, యువకులు, వృద్ధుల వరకు అందరూ ఈ సమస్యలతో బాధ పడుతుండగా,మెజారిటీ 50 ఏళ్లు పైబడిన వారు ఇందులో ఉన్నారు.  ఇన్ఫెక్షియస్ కంటి జబ్బులు,  దెబ్బలతోపాటు కంటి శుక్లం, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సు పెరిగే కొద్దీ వ్యక్తి దృష్టిని ప్రభావితం చేస్తాయి. వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. 

కనీస జాగ్రత్తలు, కొన్ని సాధారణ చికిత్సలతో  చాలా దృష్టి లోపాలను నివారించవచ్చు. కాలుష్యం, ప్రమాదాలు, విటమిన్ల లోపం, రసాయన పరిశ్రమల కార్మికులు,  ఎక్కువ సేపు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లపై గంటల తరబడి పనిచేయడం వల్ల కూడా  కంటిచూపు దెబ్బ తినే ప్రమాదం ఉంది.  అయితే ఎప్పటికప్పుడు సంబంధిత పరీక్షలు, శ్రద్ధ అవసరం. దురదృష్టవశాత్తు మనలో చాలా మంది లేదా ప్రతి రెండో లేదా మూడో వ్యక్తి ఏదో ఒక రకమైన కంటి సమస్య లేదా వ్యాధులతో బాధపడుతున్నారని అనుకుందాం. వాటిలో కొన్ని అంత తీవ్రంగా ఉండకపోయినా,  కొన్ని మాత్రం చాలా ప్రాణాంతకం కావచ్చు. అందుకే ముందస్తు పరీక్షలు అవసరం.

కంటి ఆరోగ్యం, ఆహారం, జాగ్రత్తలు
కంటి ఆరోగ్యంకోసం ఆకుకూరలు, గుడ్లు, బీన్స్, క్యారెట్ వంటి ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ధూమపానాన్ని మానుకోవాలి. లేదంటే కంటి శుక్లాలు, కంటి నరాలు దెబ్బ తినడంతోపాటు అనేక దృష్టి సంబంధిత సమస్యలు వస్తాయి. అధిక ఎండనుంచి రక్షించుకునేందుక యూవీ ప్రొటెక్టెడ్‌ సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. ఒకవేళ ప్రమాదకరమైన కెమికల్స్‌ లేదా పనిముట్లతో పనిచేస్తున్నట్టయితే కంటిరక్షణకు సంబంధించిన  కళ్లజోడు ధరించాలి. కంప్యూటర్ ముందు  ఎక్కువ సమయం గడిపితే కళ్లు పొడిబారిపోతాయి. దీనికి నివారణకు ఎక్కువ సార్లు కళ్లను మూస్తూ తెరుస్తూ (బ్లింక్‌) ఉండేలా చూసుకోవాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్‌  ధరించడం మంచిది. అధికంగా స్టెరాయిడ్స్‌, నొప్పి నివారణ మాత్రలు వాడడం ఇందుకు ముఖ్య కారణం. అలాగే పిల్లల్లో వచ్చే కంటి సమస్యల నివారణకు మంచి పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు, రోజులో  కనీసం గంట అయినా వారిని  సూర్యరశ్మి తగిలేలా ఆరు బయట ఆడుకునేలా చూడాలి. 

నేత్రదానం
వీటితోపాటు మరింత ముఖ్యమైనది నేత్ర దానం. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి నేత్ర దానం చేయడం ద్వారా ఇద్దరికి కంటి చూపును ప్రసాదించ వచ్చు. తద్వారా అనేక మంది చూపు లేని వారికి మేలు జరుగుతుంది. మరొకరికి కొత్త జీవితాన్ని  ప్రసాదించేందుకు ఇపుడే ఐ డొనేషన్‌ కోసం  ప్రతిజ్ఞ చేద్దాం.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top