రెచ్చిపోతున్న రష్యా బలగాలు.. రంగంలోకి దిగిన కమలా హారిస్‌..

Kamala Harris To Visit Poland, Romania In Next Week - Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రాజధాని కీవ్‌ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యాన్‌ బలగాలు భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లుతోంది. మరోవైపు రష్యా దుందుడుకు చర్యతో భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. రష్యాపై ఆంక్షలు పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన పోలండ్‌, రొమేనియా దేశాల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ కీలక పర్యటన చేపట్టనున్నారు. వచ్చే వారంలో కమలా హారిస్‌ ఆ దేశాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కాగా, రష్యా దురాక్రమణలకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కమలా హారిస్​ డిప్యూటీ ప్రెస్​ సెక్రటరీ సబ్రినా సింగ్​ తెలిపారు. 

కమలా హారిస్‌.. మార్చి 9-11 మధ్య పోలండ్​లో రాజధాని వార్సా​, రొమేనియాలోని బుకారెస్ట్​లో పర్యటించనున్నట్టు సబ్రినా వెల్లడించారు. ఈ క్రమంలో ఆ రెండు దేశాల నేతలతో సమావేశమై.. ఉక్రెయిన్‌, రష్యా సంక్షోభంపై చర్చించనున్నట్టు చెప్పారు. ​అలాగే ఉక్రెయిన్​కు భద్రత, ఆర్థిక, మానవతా సాయం వంటి కీలక అంశాలపైనా కూడా చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది. అయితే, తాము ప్రత్యక్షంగా యుద్దంలో పాల్గొనబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, కమలా హారిస్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top