సుదూర విశ్వంలో బుల్లి గెలాక్సీలు  | James Webb Telescope shares mesmerising images of stars and galaxies | Sakshi
Sakshi News home page

సుదూర విశ్వంలో బుల్లి గెలాక్సీలు 

Jun 17 2025 6:13 AM | Updated on Jun 17 2025 6:13 AM

James Webb Telescope shares mesmerising images of stars and galaxies

జేమ్స్‌ వెబ్‌ కంటికి చిక్కాయి 

1,300 కోట్ల ఏళ్ల నాటివి 

వాటివల్లే పారదర్శక విశ్వం 

అలా మన ఉనికికి కారణమయ్యాయి 

అవడానికి అవి చిట్టి పొట్టి గెలాక్సీలే. కానీ వాస్తవానికి మహా గట్టి గెలాక్సీలు. అటూ ఇటుగా ఈ అనంత విశ్వంతో పాటే పురుడు పోసుకున్నాయి. విశ్వం 1,380 కోట్ల ఏళ్ల కింద ఉనికిలోకి వచ్చిందన్నది సైంటిస్టుల మాట. ఈ బుల్లి నక్షత్ర మండలాల వయసు ఏకంగా 1,300 కోట్ల ఏళ్లు! వీటి నుంచి అనూహ్యమైన ఆకుపచ్చని కాంతి అపార పరిమాణంలో వెలువడుతోంది.

 వెయ్యి కోట్ల పై చిలుకు ఏళ్ల కింద ఎటు చూసినా చిక్కనిబూర్‌ మాదిరిగా కమ్ముకుని, కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని విశ్వాన్ని పారదర్శకంగా, ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మార్చింది ఆ కాంతేనట. ఆ లెక్కన మన ఆవిర్భావం కూడా దాని పుణ్యమేనని సైంటిస్టులు తేల్చారు. అంతటి కీలకమైన కాంతికి ఉద్గమ స్థానమైన బుల్లి గెలాక్సీలను జేమ్స్‌ వెబ్‌ టెలీస్కోప్‌ తాజాగా తన బ్రహా్మండమైన కెమెరా కంటితో బంధించింది. అంతరిక్ష శాస్త్రవేత్తలు వాటిని ముద్దుగా రెడ్‌ షిఫ్ట్‌–7 అని పిలుచుకుంటున్నారు.

డజన్లకొద్దీ... 
ఈ బుల్లి గెలాక్సీలు డజన్లకొద్దీ ఉన్నట్టు జేమ్స్‌ వెబ్‌ తేల్చింది. వైశ్విక పునరయానీకరణగా పిలిచే తొలి దశలో వీటి పాత్ర కీలకంగా నిలిచింది. అప్పట్లో విశ్వమంతటా తటస్థ హైడ్రోజన్‌ వాయువుతో నిండి ఉండేది. దాంతో సర్వత్రా సన్నని పొగమంచు మాదిరి పొర కమ్ముకుని ఉండేది. తొలి 100 కోట్ల ఏళ్లూ ఇదే పరిస్థితి. అలాంటి విశ్వం నేడున్న రూపురేఖలు సంతరించుకుందంటే ఈ గెలాక్సీల్లో నాడు జరిగిన స్టార్‌ బరస్ట్‌ వల్లే! అంటే తారల ఆవిర్భావానికి కారణమైన పెను పేలుళ్లు. ఆ క్రమంలో ఈ గెలాక్సీల నుంచి వెలువడ్డ శక్తిమంతమైన పరారుణ రేడియో ధారి్మకత హైడ్రోజన్‌ అణువుల్లోని ఎల్రక్టాన్లను విడదీసి ఆ వాయువును అయానీకరించింది. 

గెలాక్సీల్లో నుంచి నేటికీ వెలువడుతున్న ఆ ఆకుపచ్చని ఉద్గారాలను జేమ్స్‌ వెబ్‌ సాయంతో పరిశోధకులు గుర్తించారు. గెలాక్సీల సమూహాన్ని అబెల్‌ 2744గా పిలుస్తున్నారు. దీని తాలూకు అపరిమితమైన గురుత్వాకర్షణ ఒక సహజ పట్టకంగా జేమ్స్‌ వెబ్‌కు సాయపడింది. విశ్వాన్ని జేమ్స్‌ వెబ్‌ తాలూకు నియర్‌ ఇన్ఫ్రా రెడ్‌ కెమెరా (ఎన్‌ఐఆర్‌ కామ్‌), ఇన్ఫ్రా రెడ్‌ స్పెక్ట్రో గ్రాఫ్‌ (ఎన్‌ఐఆర్‌ స్పెక్‌) లెన్స్‌ ఏకంగా మరో 400 కోట్ల ఏళ్లు వెనక్కు చూడగలిగాయి. అలా ఈ బుల్లి గెలాక్సీల ఉనికి తొలిసారి బయటపడింది. ఇవి మన పాలపుంత కన్నా ఏకంగా 2 లక్షల రెట్లు చిన్నవి కావడం విశేషం. అయినా మొత్తం విశ్వం అయానీకరణ చెందేందుకు అవసరమైనంత పరారుణ ఉద్గారాలను వెలువరించి గట్టి పిండాలు అనిపించుకున్నాయి.  
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
 
Advertisement
Advertisement