
గాజాపై పోరుకు ఇజ్రాయెల్ సైనికాధికారి నిరాకరణ
ఆయనను, మరో సైనికున్ని జైల్లో పెట్టిన ప్రభుత్వం
జెరూసలెం: ఇజ్రాయెల్ బందీల విడుదలపై స్పష్టత లేకుండా, గాజాలో పసిపిల్లల ప్రాణాలు తీస్తున్న అర్థం లేని యుద్ధం చేయలేనని ఆ దేశ సైనికాధికారి ఒకరు కుండబద్దలు కొట్టారు. అమాయక ప్రజల మరణాలు అంతులేని కొనసాగుతున్నాయి. ఓ రాజకీయ దృక్పథమంటూ లేని ఈ యుద్ధం చేయలేను’’అని కెప్టెన్ హోదాలో ఉన్న రాన్ ఫీనర్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు డేనియల్ యాహలోం అనే మరో సైనికుడు కూడా యుద్ధానికి నిరాకరించారు. దాంతో వారిని ఇజ్రాయెల్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. వారిద్దరూ ‘సోల్జర్స్ ఫర్ ది హోస్టేజెస్’అనే సంస్థలో పని చేస్తున్నారు.
ఫీనర్ గాజాలో మూడు దశల క్రియాశీల పోరాటంలో పాల్గొన్నారు. దళాలకు నాయకత్వ బాధ్యతల్లో ఉన్నారు. తమ హమాస్ వద్ద ఇంకా బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించడం ప్రధాన లక్ష్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. గాజాను పూర్తిగా నేలమట్టం చేసి, హమాస్‌ను రూపమాపడమే లక్ష్యమని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘గాజా స్వా«దీన ప్రణాళిక’మేరకు పాలస్తీనియన్లను గాజా నుంచి పూర్తిగా వెళ్లగొట్టినప్పుడే యుద్ధం ముగుస్తుందన్నారు. దాంతో మళ్లీ యుద్ధ విధుల్లో చేరేందుకు ఫీనర్ నిరాకరించారు.
గాజాలో జనం దుస్థితి చూడలేక
‘‘గాజాలో అంతులేని యుద్ధం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అమాయక ప్రజల అంతులేని మరణాలకు ఇది కారణమవుతోంది. మా ప్రభుత్వానికి ఓ దృక్పథం లేదు. గాజాలో ఎప్పటికీ అంతం కాని యుద్ధం సాగుతోంది. నేను దేశాన్ని ప్రేమిస్తున్నా. కానీ ఇక్కడ నా భవిష్యత్తు నా చేతి వేళ్లలోంచి జారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రాధాన్యత జాబితాలో బందీలు అట్టడుగున ఉన్నారని ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించింది. గాజావాసులు ఆకలితో అలమటిస్తున్నారు.
నా ప్లాటూన్‌లోని యోధులను వందల రోజుల పాటు రిజర్వ్ డ్యూటీకి పిలిచారు. వారిని ఇకపై విధుల్లో పాల్గొనేలా ఒప్పించలేను. ఈ దారుణ పరిస్థితులు మారనంత వరకు నేను నైతికంగా సేవలో కొనసాగలేను. ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారింది ఈ మతిలేని యుద్ధమే తప్ప విధి నిర్వహణకు నిరాకరించే నా లాంటి వ్యక్తులు కాదు. ప్రభుత్వ విధానం ఇజ్రాయెల్ విలువలను ప్రతిబింబించడం లేదు. మా ప్రభుత్వం నిజమైన దేశ రక్షణకు దోహదపడే పరిస్థితి తిరిగి వచి్చనప్పుడు తిరిగి నా సేవలందిస్తా’’అని ఫీనర్ వెల్లడించారు.