
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు
అణు, సైనిక లక్ష్యాలపై క్షిపణుల వర్షం
నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం భస్మీపటలం!
దేశవ్యాప్తంగా 200కు పైగా లక్ష్యాలపై దాడులు
తుడిచిపెట్టుకుపోయిన ఇరాన్ సైనిక పాటవం
ఆర్మీ, ఆర్‌జీ చీఫ్, సైనిక ముఖ్యులంతా మృతి
ఖమేనీ సలహాదారు,అణు శాస్త్రవేత్తలు కూడా
అణు ఒప్పందానికి రాకుంటే అంతే
ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
దాడులు ఆగబోవు: నెతన్యాహు
భారీ ప్రతీకారం తప్పదు: ఖమేనీ
ఇజ్రాయెల్‌పైకి వందలాది క్షిపణులు, డ్రోన్లు
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: పశ్చిమాసియా మరోసారి రణరంగమైంది. అమెరికా ఆశీస్సులతో ఇరాన్‌పై ఇజ్రయెల్ భీకర వైమానిక దాడులు చేసింది. అణు కర్మాగారాలే లక్ష్యంగా విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి మొదలుకుని శుక్రవారం రాత్రిదాకా పలు విడతల్లో దేశవ్యాప్తంగా 200కు పైగా అణు, సైనిక లక్ష్యాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ముందస్తుగానే ఇరాన్‌లోకి చేరవేసి ఉంచిన డ్రోన్లు కూడా కూడా అదే సమయంలో వాటిపై దాడులకు దిగాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా పూర్తిగా కుప్పకూల్చాయి. దాంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులను అడ్డుకోవడం ఇరాన్‌కు అసాధ్యంగా మారింది. రోజంతా విడతలవారీగా జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ కనీవినీ ఎరగని నష్టాలు చవిచూసింది.
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పదేపదే భారీ క్షిపణులు, బాంబులతో చేసిన దాడుల్లో నతాంజ్‌లోని ప్రధాన అణుశుధ్ధి కర్మాగారం భస్మీపటలమైంది. ఆరుగురు అణు శాస్త్రవేత్తలతో పాటు సైనిక ముఖ్యుల్లో దాదాపుగా అందరూ దాడులకు బలయ్యారు! మృతుల్లో ఇరాన్ సైన్యాధిపతి మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీ, బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం చీఫ్ అమీర్ అలీ హజిజాదే, ఫెరేడౌన్ అబ్బాసీ దవానీ, మహమ్మద్ మెహదీ టెహ్రాన్చి, పలువురు వాయుసేన అత్యున్నతాధికారులతో పాటు దేశ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ తదితరులు కూడా ఉన్నారు. ఇరాన్ అంతటా కూలిన భవనాలు, శిథిలాల దిబ్బలు, వాటినుంచి వెలువడ్డ పొగ ఆకాశాన్ని కమ్ముకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. గురిచూసి ఇరాన్ గుండెలపై కొట్టామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
ఆర్మీ చీఫ్‌తో పాటు తమవారి మృతిని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ధ్రువీకరించారు. భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కాసేపటికే ఇజ్రాయెల్‌పై ఇరాన్ 100కు పైగా డ్రోన్లతో దాడికి దిగింది. శుక్రవారం రాత్రి క్షిపణులు కూడా ప్రయోగించింది. 1980ల్లో ఇరాక్‌తో యుద్ధం తర్వాత ఇరాన్‌పై జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ప్రాంతీయ ప్రత్యర్థుల పోరు యుద్ధానికి దారితీసేలా కన్పిస్తోంది. గాజాపై ఏడాదిన్నరకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఇరాన్‌పైనా ఇజ్రాయెల్ కయ్యానికి కాలుదువ్వడం విశేషం. ఇరాన్‌కు జరిగిన భారీ నష్టాలకు లెబనాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ హెజ్బొల్లా సంతాపం తెలిపింది. అయితే ఇరాన్‌కు దన్నుగా ఇజ్రాయెల్‌పై దాడికి దిగే దిశగా ప్రకటనేమీ చేయలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో కనీసం 70 మందికి పైగా మరణించారని, 350 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.
ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ
ఇరాన్ ప్రతి దాడుల హెచ్చరికలతో ఇజ్రాయెల్ జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్, అధికారుల సూచనలను పాటించాలని సూచించింది. దాంతో జనం నిత్యావసరాలను నిల్వ చేసి పెట్టుకునేందుకు సూపర్ మార్కెట్లకేసి పరుగులు తీశారు. అన్ని సరిహద్దుల వద్దా తమ సైనికులు సర్వ సన్నద్ధంగా ఉన్నారని మిలిటరీ చీఫ్ ఇయాల్ జమీర్ హెచ్చరించారు. తమను సవాలు చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రాడార్ కేంద్రాలతో పాటు డజన్ల కొద్దీ క్షిపణి ప్రయోగ వ్యవస్థలను కూడా నేలమట్టం చేసినట్టు తెలిపారు.
టెల్ అవీవ్‌లోని బెన్‌గురియన్ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసేసింది. నెతన్యాహును తీవ్రంగా వ్యతిరేకించే విపక్ష నేత యైర్ లపిడ్‌తో పాటు ప్రత్యర్థి పార్టీలు, శక్తులు కూడా ఇరాన్‌పై దాడికి పూర్తి మద్దతు తెలపడం విశేషం. తమ మనుగడకు ఇరాన్ ప్రబల ముప్పన్న అభిప్రాయం ఇజ్రాయెలీలందరిలోనూ ఉంది. ఇది నెతన్యాహుకు అతి పెద్ద సానుకూలాంశమని చెబుతున్నారు. మరోవైపు ఇరాన్‌లో కూడా ఎమర్జెన్సీని మించిన పరిస్థితి కొనసాగుతోంది.
అణు ముప్పును తిప్పికొట్టేందుకే: నెతన్యాహు
ఇరాన్‌పై తమ తొలి దెబ్బ అదిరిందని నెతన్యాహు ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్ మనుగడను సవాలు చేసే ఇరాన్ అణు ముప్పును రూపుమాపేందుకే తిప్పికొట్టడానికి దాడులు ప్రారంభించాం. అవి చాలా రోజులు కొనసాగుతాయి. ముప్పు తొలగేదాకా వెనకంజ వేసేది లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని ఇరాన్ బహిరంగ ప్రకటనలు చేస్తోంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది.
ఇటీవల ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంతో 9 అణుబాంబులను తయారు చేయొచ్చు. ఇరాన్‌ను ఇప్పుడు నిలువరించకపోతే ఇజ్రాయెల్‌కు పెనుప్రమాదం. నాజీ హోలోకాస్ట్ మారణకాండ నుంచి మేం పాఠాలు నేర్చుకున్నాం. మరోసారి బాధితులుగా మిగిలిలేందుకు సిద్ధంగా లేం’’ అని స్పష్టం చేశారు. ‘‘మా పోరు ఇరానీలతో కాదు. వారిని 46 ఏళ్లుగా అణచివేస్తున్న నియంతలతో. వారి బారినుంచి ఇరానీలకు విముక్తి కల్పించే రోజు ఎంతో దూరం లేదు’’ అని చెప్పారు.
ఫైటర్లకు గాల్లోనే ఇంధనం
ఇరాన్‌పై దాడుల సందర్భంగా ఇజ్రాయెల్ తన వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో ప్రదర్శించింది. దాని యుద్ధ విమానాలు మధ్యలో వెనక్కు వచ్చే అవసరం లేకుండా వాటికి అవసరమైన ఇంధనాన్ని రీఫ్యూ యలర్ల ద్వారా గాల్లోనే ఎప్పటి కప్పుడు అందజేస్తూ వచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇరాన్ గగనతలం లోపలికి చొచ్చు కెళ్లాయా, లేక సమీప దేశాల నుంచే క్షిపణులు ప్రయోగించాయా అన్నదానిపై స్పష్టత లేదు. తమ ప్రాంతాల మీదుగా దూసుకు పోతున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను ఇరాక్ ప్రజలు ఊపిరి బిగబట్టి వీక్షించారు.
ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
ఇజ్రాయెల్ దాడులకు తీవ్రమైన శిక్ష విధిస్తామని ఖమేనీ ప్రకటించారు. దాడుల అనంతరం అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వెంటనే 100 డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేశారు. వాటిని ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. చాలా డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన వైమానిక స్థావరాలను, గగన తలాన్ని మూసివేసింది. పక్క దేశం ఇరాక్ కూడా గగనతలాన్ని మూసేసింది. అన్ని విమానాశ్రయాలలో విమాన రాకపోకలను నిలిపివేసింది. దాంతో ఇరాన్, ఇరాక్ మీదుగా వెళ్లే అనేక విమానాలు దారిమళ్లించుకోవాల్సి వచ్చింది. మరికొన్ని విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ కారణంగా భారత్‌కు సంబంధించిన పలు విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి.
దాడులు ఎక్కడెక్కడ?
రాజధాని టెహ్రాన్ మొదలుకుని ఇరాన్‌వ్యాప్తంగా పలు నగరాలు, ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. తబ్రీజ్, కెర్మన్ షా సైనిక స్థావరాలతో పాటు అరక్, బుషెహ్ర్ అణు స్థావరాలు వీటిలో ఉన్నాయి. టెహ్రాన్‌లో పలు ప్రాంతాలు దాడుల్లో నేలమట్టమ య్యాయి. అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నేతృత్వం వహి స్తున్న శాస్త్రవేత్తలు, సీనియర్ అధికా రులను ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది. నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై దాడులను అంతర్జాతీయ అణుఇంధన సంస్థ ధ్రువీకరించింది. రేడియేషన్ స్థాయిని గమని స్తున్నట్టు పేర్కొంది.
దాడుల గురించి ముందే తెలుసు: ట్రంప్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ ప్రకటించారు. అయితే వాటిలో తమ ప్రమేయం లేదన్నారు. ఇకనైనా అణ్వాయుధ కలలను పక్కన పెట్టాలని ఇరాన్‌ను హెచ్చరించారు. ‘‘దౌత్యపరమైన పరిష్కారానికి ముందుకు రావాలి. కాదని ప్రతీకార దాడులకు పాల్పడితే ఎదుర్కొనేందుకు మా సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉంది. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్‌ను కూడా కాపాడుతుంది. మాతో ఇరాన్ తక్షణం అణు ఒప్పందానికి రావాలి. అదొక్కటే దారి. లేదంటే మరిన్ని తీవ్ర పర్యవసానాలు తప్పవు’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ‘‘తదుపరి దశలో మరింత తీవ్రమైన దాడులకు ప్రణాళికలు సిద్ధమైపో యాయి.
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కాలాతీతం కాకముందే తెలివైన నిర్ణయం తీసుకోండి. భారీ జన హననాన్ని తప్పించండి. ఇరాన్ అనే దేశమే లేకుండా పోయే పరిస్థితి రాకుండా చూసుకోండి’’ అంటూ అల్టిమేటమిచ్చారు. జాతీయ భద్రతా మండలి చీఫ్ తదితరులతో వైట్‌హౌస్ సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులను సమీక్షించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చర్యలు ఏకపక్షమైనవని, తమ ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు.
శాంతి నెలకొనాలి: మోదీ
పశ్చిమాసియాలో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ తక్షణం శాంతి, సుస్థిరత నెలకొ నాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ఆయనకు ఫోన్ చేశారు. ఇరాన్‌పై దాడులకు దారితీసిన పరిస్థితు లను వివరించారు. ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా దేశాల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. ఇజ్రాయెల్, ఇరాన్ ఇరు దేశాలతోనూ భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేసింది. వాటికి అవసరమైన ఎలాంటి సాయానిౖనా సిద్ధమని పేర్కొంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి పట్ల రష్యాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వెలిబుచ్చాయి.