
ఆహార కేంద్రాలపై కాల్పుల్లో 23 మంది
వైమానిక దాడుల్లో మరో 30 మంది
దెయిర్ అల్ బలాహ్: గాజాలో అన్నార్తులపై ఇజ్రాయెల్ పాశవిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆహార కేంద్రాలపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పులు, వైమానిక దాడుల్లో ఏకంగా 74 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సముద్రతీర అల్–బకా కేఫ్‌పై సోమవారం జరిగిన వైమానిక దాడుల్లో 30 మంది మరణించారు. జీహెచ్‌ఎఫ్ ఆహార కేంద్రంపై జరిపిన కాల్పుల్లో 23 మంది మరణించారు. గాజాలో జరిగిన మరో రెండు దాడుల్లో 15 మంది మరణించారని షిఫా ఆసుపత్రి తెలిపింది.
జవైదా పట్టణ సమీపంలో ఓ భవనంపై దాడిలో ఆరుగురు మరణించినట్టు అల్ అక్సా ఆసుపత్రి తెలిపింది. అల్ బకా కేఫ్ పరిసరాలు దాడుల ధాటికి భూకంపం వచ్చినట్టుగా కంపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 నెలలుగా యుద్ధం కొనసాగుతున్న సమయంలోనూ కార్యకలాపాలు కొనసాగించిన అతికొద్ది కేఫ్‌లలో ఇది ఒకటి. ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో ఫోన్ చార్జింగ్ కోసం స్థానికులు ఎక్కువగా వస్తుంటారు. నేలపై రక్తసిక్తమైన, వికృతమైన మృతదేహాలు, గాయపడిన వారిని దుప్పట్లలో మోసుకెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆహారం కేంద్రం నుంచి వస్తుండగా...
ఇజ్రాయెల్, అమెరికా మద్దతుతో ఖాన్ యూనిస్‌లోని గాజా హ్యుమానిటేరియన్ ఫండ్ (జీహెచ్‌ఎఫ్) ఆధ్వర్యంలో నడుస్తున్న సహాయ కేంద్రం నుంచి తిరిగి వస్తున్న అన్నార్తులపై కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ‘‘సైనికులతో కూడిన యుద్ధ ట్యాంకులు, వాహనాలు మావైపు దూసుకొచ్చాయి. ఇష్టానికి కాల్పులకు దిగాయి’’ అని వెల్లడించారు. పిల్లలతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని, వారి పరిస్థితి తెలియడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఉదంతాన్ని సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.