ఈ యుద్ధం.. ప్రపంచానికి పెనుభారం | Israel And Iran Clash Effect On World Situations | Sakshi
Sakshi News home page

ఈ యుద్ధం.. ప్రపంచానికి పెనుభారం

Jun 18 2025 7:38 AM | Updated on Jun 18 2025 9:40 AM

Israel And Iran Clash Effect On World Situations

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంపై ప్రపంచ దేశాల ఆందోళన  

పతనమైన స్టాక్‌ మార్కెట్లు.. మదుపరుల సంపద ఆవిరి 

హొర్మూజ్‌ జలసంధిని మూసివేసే యోచనలో ఇరాన్‌  

ముడి చమురు ధర పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు  

పెరుగనున్న ఉత్పత్తి వ్యయం... వినియోగదారులపైనే భారం  

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో అగ్రశ్రేణి దేశాల్లో ఒకటైన ఇరాన్‌ నేడు యుద్ధభూమిగా మారింది. పశ్చిమాసియాలో బలీయమైన సైనిక శక్తి కలిగిన రెండు దేశాలు ప్రత్యక్షంగా తలపడుతున్నాయి. ఈ యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు, వైమానిక రంగంతోపాటు కీలక రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. భారీగా సంపద హరించుకుపోయింది. సోమవా రం కొంతవరకు కోలుకున్నాయి. మరోవైపు ఆయుధ తయారీ సంస్థలతోపాటు చమురు కంపెనీల షేర్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్‌ మారెŠక్‌ట్‌ను నమ్ముకోవడం తెలివైన పని కాదన్న ఆలోచనతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు దృష్టి పెట్టారు. వారు తమ సొమ్మును బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు.  

100 డాలర్లకు ముడి చమురు?  
ఇరాన్‌లో ఎప్పుడు యుద్ధం జరిగినా తక్షణమే ప్రభావితమయ్యేది చమురు రంగమే. బ్యారెల్‌(158.98 లీటర్లు) ముడి చమురు ధర సోమవారం 74.60 డాలర్లకు చేరుకుంది. గురువారంతో పోలిస్తే 7 శాతం పెరిగింది. ఒకవేళ యుద్ధం మరింత ఉధృతంగా మారి, హొర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేస్తే బ్యారెల్‌ ముడి చమురు ధర 100 డాలర్లు దాటేస్తుందని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ గోల్డ్‌మాన్‌ సాచ్స్‌ తేల్చి చెప్పింది. ప్రపంచంలో సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో మూడింట ఒకవంతు హొర్మూజ్‌ జలసంధి గుండానే జరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది.

ఇరాన్, గల్ఫ్‌ దేశాలను వేరుచేసే అతిసన్నని సముద్ర మార్గమైన హొర్మూజ్‌పై ఆధిపత్యం ఇరాన్‌దే. ఇజ్రాయెల్‌తో యుద్ధం తీవ్రస్థాయికి చేరితే హొర్మూజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేయాలని ఇరాన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే భారత్, జపాన్, చైనా సహా పలు ఆసియా దేశాలకు చమురు కష్టాలు తప్పవు. 1980వ దశకంలో ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధ సమయంలో హొర్మూజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేయలేదు. ఈసారి కూడా మూసివేసే పరిస్థితి ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే ముడి చమురు ఎగుమతులు ఆగిపోతే ఇరాన్‌ ఆర్థికగా నష్టపోవడం ఖాయం. పొంచి ఉన్న ద్రవ్యోల్బణ ముప్పు  చమురు ధరలు పెరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అంతిమంగా ఆ భారం భరించాల్సింది వినియోగదారులే. చమురు కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. వృద్ధిరేటు తగ్గిపోతుంది. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. జీ7 దేశాల్లో కేంద్ర బ్యాంకులు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యాయి.   
    
విమానయానం మరింత ప్రియం  
యుద్ధం వల్ల పశ్చిమాసియాలో చాలా దేశాలు ముందు జాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో విమానయాన సంస్థలు తమ విమానాలను కూడా రద్దు చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నాయి. దీంతో వ్యయం పెరుగుతోంది. విమానయానం మరింత ఖరీదుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ తదితర సంస్థలు ఇరాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా వంటి దేశాల నుంచి తమ విమానాలు నడపడం లేదు. తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా తమ గగనతలం పూర్తిగా మూసి ఉంటుందని ఇరాన్‌ అధికార వర్గాలు ప్రకటించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement