బాలిలో బద్ధలైన అగ్ని పర్వతం  | Indonesia Mount Lewotobi Laki-Laki Erupts | Sakshi
Sakshi News home page

బాలిలో బద్ధలైన అగ్ని పర్వతం 

Jun 19 2025 5:29 AM | Updated on Jun 19 2025 5:29 AM

Indonesia Mount Lewotobi Laki-Laki Erupts

గగనతలం మూసివేత 

వెనుదిరిగిన ఎయిరిండియా విమానం

బాలి: ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్‌ లెవోటోబి లకి–లకి మంగళవారం సాయంత్రం బద్దలైంది. భారీ బూడిద ఆకాశంలోకి ఎగిసిపడింది. ఈ బూడిద మేఘం దాదాపు 150 కి.మీ దూరం నుండి కనిపిస్తోంది. దీంతో అధికారులు అత్యున్నత స్థాయి అగ్నిపర్వత హెచ్చరికను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా గగనతలాన్ని మూసేశారు. బాలిలోని న్గురా రాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక విమాన కార్యకలాపాలను నిలిపివేశారు.

వర్జిన్‌ ఆ్రస్టేలియా, జెట్‌స్టార్, ఎయిర్‌ న్యూజిలాండ్, సింగపూర్‌కు చెందిన టైగర్‌ ఎయిర్, చైనాకు చెందిన జున్యావో ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా విమానాలను రద్దు చేశాయి. కొన్ని దారి మళ్లించాయి. ఢిల్లీ నుంచి బాలికి వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని గాల్లో ఉండగానే తిరిగి రావాలని సూచించడంతో.. అది ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయానికి తిరిగి చేరుకుంది. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగారని ఎయిర్‌లైన్స్‌ ధ్రువీకరించింది. భారీ వర్షాల వల్ల లావా ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందని ఇండోనేషియా జియాలజీ ఏజెన్సీ హెచ్చరించింది. నివాసితులు, పర్యాటకులు అప్ర మత్తంగా ఉండాలని కోరింది. 
 
ఇండోనేషియాలోని ఫ్లోర్స్‌ తైమూర్‌ జిల్లాలో ఉన్న మౌంట్‌ లెవోటోబి లకి–లకి పర్వతం 5,197 అడుగుల ఎత్తున్నది. ఇది ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’వెంబడి ఉండటంతో ఇండోనేషియాలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. ఇలాంటి విస్ఫోటనాల సమయంలో ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానమైన బాలిలో గగనతలాని మూసివేస్తారు. ఇదే మౌంట్‌ లెవోటోబి లకి లకి గతేడాది నవంబర్‌లో విస్ఫోటనం చెందడంతో తొమ్మిది మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు.  

Advertisement
 
Advertisement
Advertisement