కరోనా: ‘అప్పుడు పడ్డ కష్టాలే.. ఇందుకు స్ఫూర్తి’

Indian Origin Chef Feeding Needy During Pandemic In Australia - Sakshi

రోజూ 150 భోజనాలు సిద్ధం చేస్తున్నాం

పెద్దమనసు చాటుకుంటున్న చెఫ్‌ శ్రీవాస్తవ్‌

ఫుడ్‌ట్రక్‌ కొనాలంటే 70 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు కావాలి

మెల్‌బోర్న్‌: మహమ్మారి కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభాగ్యులు తిండి దొరక అవస్థలు పడ్డారు. అనుకోని విపత్తు వచ్చి పడటంతో కనీస అవసరాలు తీరక కష్టాలపాలయ్యారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు మానవత్వమున్న ప్రతీఒక్కరు ముందుకు వచ్చారు. తమకు తోచిన సాయం చేస్తూ రియల్‌ హీరోలు అనిపించుకున్నారు. ఆస్ట్రేలియాలో సెటిలైన భారతీయుడు దామన్‌ శ్రీవాస్తవ్‌ ఇదే కోవలోకి వస్తారు. అన్నార్థుల ఆకలి తీరుస్తూ నిజమైన ‘హీరో’గా నిలిచారు. కరోనా కాలంలో అవిశ్రాంత కృషితో ఎంతో నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.

వివరాలు.. ఢిల్లీకి చెందిన శ్రీవాస్తవ్‌(54) ముప్పై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే సెటిలయ్యారు. మెల్‌బోర్న్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నారు. గల్ఫ్‌ యుద్ధ సమయంలో ఇరాక్‌లో పనిచేసిన ఆయన.. ప్రస్తుతం కరోనా సంక్షోభం నేపథ్యంలో పేదవారికి, విదేశీ విద్యార్థులకు ఫుడ్‌ ప్యాకెట్లు సరఫరా చేస్తూ తన వంతు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం తన సేవను విస్తరించాలనుకుంటున్నానని, అందుకోసం ఫుడ్‌ట్రక్‌ కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తనకు అండగా నిలవాల్సిందిగా ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. (చదవండి: ‘మా నాన్న శాశ్వతంగా వెళ్లిపోయారు’)

ఈ విషయం గురించి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘‘ఈ మహమ్మారి గల్ఫ్‌ వార్‌ వంటిది కాదు. కానీ వైరస్‌ వ్యాప్తి కారణంగా ఎంతో మంది భయంతో ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను కూడా పేదరికాన్ని అనుభవించిన వాడినే. ఆస్ట్రేలియాకు వచ్చిన తొలినాళ్లలో నివాస వసతి లేక ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నేను పడ్డ కష్టాలే ఇప్పుడు నన్ను ఈ సేవకు ఉపక్రమించేలా చేశాయి. నేను రోజూ దాదాపు 150 మందికి సరిపడా భోజనాలు సిద్ధం చేస్తున్నాను. నా భార్య, కూతురు కూడా ఇందుకు సహకరిస్తున్నారు.

రోజూ నా కార్లో భోజనాలు తీసుకవెళ్లి అవసరం ఉన్న వారికి అందిస్తున్నాను. ఫుడ్‌ట్రక్‌ ఉంటే బాగుంటుందని ఆలోచించాను. అందుకోసం విరాళాలు సేకరించాలనుకున్నాను. ఈ విషయం తెలిసి చాలా మంది ముందుకు వచ్చారు. నాలుగు వారాల్లో 13 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు పోగయ్యాయి. 70 వేల డాలర్లు ఉంటే ఫుడ్‌ట్రక్‌ కొనవచ్చు. ఇరుగుపొరుగు వాళ్ల నుంచి కూడా అనూహ్య స్పందన లభించింది. స్థానికులు నాకు అండగా ఉంటున్నారు.

కూరగాయలు తీసుకువచ్చి ఇస్తున్నారు. ప్రసుతం ఆరుగురు వాలంటీర్లు ఉన్నారు. మహమ్మారి ముగిసిపోయిన తర్వాత కూడా ఈ సేవను ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక భారత్‌లో వలస కార్మికుల పాలిట దైవంగా మారిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ వంటి మహోన్నతులను ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో మొదలైన ఆయన సేవా కార్యక్రమాలు నేటికీ కొనసాగుతున్నాయి.(లాక్‌డౌన్‌.. 700 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top