లాక్‌డౌన్‌.. 700 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్‌ | Paris 700 KM Traffic Jam Residents Flee Amid 2nd Covid 19 Lockdown | Sakshi
Sakshi News home page

సెకండ్‌ లాక్‌డౌన్‌.. 700 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్‌

Oct 31 2020 9:57 AM | Updated on Oct 31 2020 2:28 PM

Paris 700 KM Traffic Jam Residents Flee Amid 2nd Covid 19 Lockdown - Sakshi

పారిస్‌: యూరప్‌ దేశం ఫ్రాన్స్‌పై కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ సెకండ్‌ వేవ్‌ మొదలైపోయింది. వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోవడంతో సగానికి పైగా ఐసీయూ బెడ్స్‌ కోవిడ్‌ రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 1 వరకు లాక్‌డౌన్‌ విధిస్తూ ఫ్రెంచి ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గురువారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా పారిస్‌ సహా ప్రధాన పట్టణాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యావసరాల కోసం మినహా పౌరులు బయటకు రావొద్దని స్పష్టం చేసింది. దీంతో హాలీడే ట్రిప్పుల కోసం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు, నిబంధనల నేపథ్యంలో ఇళ్లకు చేరుకునే వారి వాహనాలతో రాజధాని నగరంలో భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. సుమారు 435 మైళ్లు(700 కిలోమీటర్ల) మేర రోడ్ల మీద వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.  (చదవండి: నా పిల్లలకు ఈ మాట చెప్పండి..)

ఇకపై అవన్నీ కుదరవు
‘‘కారణం లేకుండా స్నేహితుల ఇళ్లకు వెళ్లడం, వాళ్లను ఆహ్వానించడం, అంతా కలిసి బయటకు వెళ్లడం వంటివి ఇకపై కుదరకపోవచ్చు. ప్రతిఒక్కరు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది’’అని ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్నింగ్‌వాక్‌, ఎక్సర్‌సైజ్‌ కోసం బయటకు వెళ్లే ప్రజలు.. అందుకోసం ఇంటి నుంచి కిలోమీటరు పరిధిలో ఉండే ప్రాంతాలు ఎంచుకోవాలని, వైద్య అవసరాలు, నిత్యావసరాల కోసం మినహా బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు మూసివేయాలని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే నెలలపాటు ఇంట్లోనే మగ్గిపోయిన తమకు ఈ లాక్‌డౌన్‌ వల్ల మరోసారి నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: సెకండ్‌ వేవ్‌ మొదలైంది.. మళ్లీ లాక్‌డౌన్‌)

యూరప్ దేశాల్లో రోజుకు సగటున 1370 మరణాలు
ఇక ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయిన విదేశీ విద్యార్థులు, తమ వాళ్లకు ఇంకెన్నాళ్లు దూరంగా ఉండాల్సి వస్తుందోనని, ఇక్కడి నుంచి క్షేమంగా బయటపడితే చాలు అంటూ ఆవేదన చెందుతున్నారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతిరోజూ సగటున యూరప్‌ దేశాల్లో 1,370 మంది చనిపోతున్నారు. యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ సిఫారసుల ప్రకారం కరోనా చేసిన పరీక్షల్లో 3శాతం కంటే తక్కువ మందికే పాజిటివ్‌ రావాలి. కానీ స్పెయిన్‌లో 11%, ఫ్రాన్స్‌లో 18%, నెదర్లాండ్స్, చెక్‌ రిపబ్లిక్‌లలో 26% వరకు పాజిటివిటీ రేటు ఉంది.

కోవిడ్‌–19 వ్యాపించిన తొలినాళ్లలో ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి యూరప్‌ దేశాల్లో కరోనా తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ఖననం చేసే చోటుచేలేక కోవిడ్‌ మృతదేహాలు కుప్పలుతెప్పలుగా పడిఉన్న దృశ్యాలు వైరస్‌ తీవ్రతను కళ్లకుగట్టాయి. అయినప్పటికీ తొలి దశ విజృంభణ ముగిసిపోయిన ఈ యూరప్‌ దేశాలు దేశాలు నిబంధనలు సడలించి, రిలాక్స్‌ అవడం, కోవిడ్‌ రోగుల ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్‌ వంటి కార్యక్రమాలను పక్కాగా అమలు చేయకపోవడం వల్లే సెకండ్‌ వేవ్‌ మొదలైందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement