
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు యథాతథం
వాషింగ్టన్: రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్లురిమి చూసినా భారత్ ఏమాత్రం బెదరలేదని తాజాగా వెల్లడైంది. భారత్ చమురు, ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా ఆర్జించిన లాభాలను రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం వెచ్చిస్తోందని ట్రంప్ ఇప్పటికే ఆరోపించారు.
ఈ కొనుగోల్లు ఆపకపోతే భారీ దిగుమతి సుంకాలు విధిస్తానని భారత్‌ను ట్రంప్ బెదిరించినా రష్యా ముడిచమురును భారత రిఫైనరీ కంపెనీలు నిరాటంకంగా కొనుగోలుచేస్తూనే ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలుచేయబోదనే వార్తలను విన్నానని ట్రంప్ శనివారం వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే జాతీయమీడియాలో భిన్నమైన వార్తలు రావడం విశేషం.
‘‘రష్యా నుంచి చమురు కొనే సంస్కృతికి భారత్ మంగళం పాడుతుందని విన్నా. ఇది నిజంగా మంచి విషయం. అయితే ఇందులో నిజమెంతో నాక్కూడా తెలీదు. తర్వాత ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్ గల్ఫ్ క్లబ్‌లో మీడియాతో ట్రంప్ అన్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికా ఎంతగా బెదిరించినా సరే భారత్ తన స్వప్రయోజనాలకు, సార్వ¿ౌమతానికే అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మరోసారి రుజువైందని జాతీయమీడియాలో శనివారం పలు కథనాలు వచ్చాయి.
‘‘ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలా? వద్దా? కొంటే ఎంత పరిమాణంలో కొనాలి? అనేవి కేవలం మార్కెట్ ధర ప్రకారంమే నిర్ణయం తీసుకుంటాంగానీ ట్రంప్ వంటి బయటివ్యక్తి బెదిరింపులకు భయపడికాదు’’ అని రిఫైనరీల సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘‘ ముడి చమురు నాణ్యత, సరఫరా వ్యయాలు, ఇతరత్రా ఖర్చుల గురించే మేం ఆలోచిస్తాంగానీ అమెరికా ఆదేశించిందనో మరెవరో వద్దన్నారో మేం చమురు కొనుగోళ్లను ఆపబోం’’ అని భారతీయ రిఫైనరీలు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.