భారత్‌కు సాయం అనవసరం | India Has a Lot More Money Than Us | Sakshi
Sakshi News home page

భారత్‌కు సాయం అనవసరం

Feb 20 2025 5:17 AM | Updated on Feb 20 2025 5:23 AM

India Has a Lot More Money Than Us

ఓటింగ్‌ శాతం పెంపు నిధి రద్దుపై ట్రంప్‌

భారత్‌ దగ్గర ఎంతో డబ్బుందని వ్యాఖ్యలు

భారత్‌పై గౌరవం ఉందన్న అధ్యక్షుడు

వాషింగ్టన్‌: భారత్‌లో ఓటింగ్‌ను పెంచడానికంటూ అందిస్తూ వస్తున్న 2.1 కోట్ల డాలర్ల నిధిని రద్దు చేస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్‌) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకున్నారు. భారత్‌కు అసలు ఇంతకాలంగా ఆ మొత్తం ఎందుకు ఇస్తూ వచ్చినట్టని ప్రశ్నించారు. విదేశాలకు సహాయ నిధులకు కోత పెడుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన అనంతరం మంగళవారం తన నివాసం మార్‌–ఎ–లాగోలో అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్‌ దగ్గర చాలా డబ్బుంది. 

అమెరికా నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. మాపై వాళ్ల టారిఫ్‌లు చాలా ఎక్కువ. అలాంటి దేశానికి 2.1 కోట్ల డాలర్లు ఎందుకిస్తున్నామో అర్థం కావడం లేదు!’’ అన్నారు. అయితే భారత్‌ పట్ల, ఆ దేశ ప్రధానిపై నాకెంతో గౌరవముందని చెప్పుకొచ్చారు. భారత్‌తో పాటు పలు దేశాలకు అందిస్తున్న మొత్తం 72.3 కోట్ల డాలర్ల సహాయ నిధులకు డోజ్‌ ఆదివారం మంగళం పాడటం తెలిసిందే.

 ఈ వ్యవహారంపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థికవేత్త సంజీవ్‌ సన్యాల్‌ స్పందించారు. భారత్‌లో ఓటింగ్‌ శాతం మెరుగు పరిచేందుకు అమెరికా నుంచి 2.1 కోట్ల డాలర్లను ఇన్నేళ్లుగా ఎవరు అందుకుంటూ వచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నానంటూ ట్వీట్‌ చేశారు. భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అమెరికా నిధులు సమకూరుస్తోందన్న వార్తలను కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ ఇప్పటికే ఖండించడం తెలిసిందే. 2012లో తాను సీఈసీగా ఉండగా ఈ మేరకు అమెరికా ఏజెన్సీ నుంచి ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.

‘స్పేస్‌’లో మస్క్‌ జోక్యముండదు
అంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ జోక్యం ఉండబోదని ట్రంప్‌ స్పష్టం చేశారు. మస్క్‌ ప్రధానంగా డోజ్‌ ద్వారా ప్రభుత్వానికి ఖర్చులను తగ్గించే పనిమీద ఉంటారన్నారు. ‘‘ఆయనను మీరు ఉద్యోగి అని పిలవవచ్చు. కన్సల్టెంట్‌ అనొచ్చు. మీకు నచ్చినట్లుగా పిలవవచ్చు, కానీ ఆయన దేశభక్తుడు’’ అని చెప్పుకొచ్చారు. మస్క్‌ ప్రభుత్వోద్యోగి కాదని, ఆయనకు ఎలాంటి నిర్ణయాధికారాలూ లేవని వైట్‌హౌస్‌ సోమవారం పేర్కొనడం తెలిసిందే.

టారిఫ్‌లపై తగ్గేదే లేదు
పరస్పర టారిఫ్‌ల విషయంలో తగ్గేదే లేదని ట్రంప్‌ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. ‘భారత్‌కు మినహాయింపు లేదు. మీరెంత విధిస్తే మేమూ అంతే విధిస్తా’మని ప్రధాని మోదీకి స్పష్టం చేశానని చెప్పారు. ప్రతి దేశానికీ ఇదే వర్తిస్తుందన్నారు. ఎలాన్‌ మస్క్‌తో కలిసి ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్‌ వంటి రంగాల్లో అమెరికాపై భారత్‌ ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తోందని ట్రంప్‌ చెప్పగా అవునంటూ మస్క్‌ శ్రుతి కలిపారు.

‘బైడెన్‌ అటార్నీ’లకు ఉద్వాసన
మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించిన అటార్నీలందరినీ తొలగించాలని ట్రంప్‌ ఆదేశించారు. న్యాయశాఖను గత నాలుగేళ్లలో మునుపెన్నడూ లేనంతగా రాజకీయమయం చేశారంటూ ఆక్షేపించారు. అందుకే ఆ శాఖలో ‘బైడెన్‌ శకం’ ఆనవాళ్లను తొలగించాలని ఆదేశించినట్టు తన ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ఇంటిని ప్రక్షాళన చేయాల్సిందే. స్వర్ణయుగపు అమెరికాలో నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ రోజు నుంచే అది మొదలవుతుంది’’ అన్నారు. యూఎస్‌ అటార్నీలుగా పిలిచే ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లను నామినేట్‌ చేయడం అధ్యక్షుడి బాధ్యత. అమెరికాలో ప్రస్తుతం 93 మంది అటార్నీలున్నారు. ప్రభుత్వ చట్టాల అమలు వీరి బాధ్యత. రిపబ్లికన్‌ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి న్యాయ శాఖ తీవ్ర ప్రకంపనలకు గురవుతోంది. పలువురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు.

ఉక్రెయిన్లో సైనిక పాలన
జెలెన్‌స్కీకి స్వదేశంలో ఆదరణ పూర్తిగా అడుగంటిందని ట్రంప్‌ అన్నారు. ‘‘జెలెన్‌స్కీ రేటింగ్స్‌ 4 శాతానికి పడిపోయాయి. ఆయ నకు ధైర్యముంటే తక్షణం ఎన్నికలకు వెళ్లాలి’’ అని సవాలు కూడా చేశారు. రష్యా కోరిక మేరకే ఇలా ఉక్రెయిన్‌లో ఎన్నికలకు డిమాండ్‌ చేస్తున్నానన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘నాతో పాటు చాలా దేశాలు ఈ మేరకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్‌ లో ఏళ్లుగా సైనిక పాలన నడుస్తోంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖర్లోగా పుతిన్‌తో తాను భేటీ అయ్యే అవకాశముందని ఈ సందర్భంగా ట్రంప్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై ట్రంప్‌ తాజా వ్యాఖ్యలను డోజ్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ పూర్తిగా సమర్థించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘‘జెలెన్‌స్కీకి శాంతి ఇష్టం లేదు. ఆయనకు కావాల్సిందల్లా మరింత డబ్బు, అధికారం మాత్రమే’’ అంటూ ఆక్షేపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement